యువతను పెడతోవ పట్టిస్తున్న పబ్జీపై కేంద్రం నిషేధం విధించిన మరుసటి రోజే.. ఆన్ లైన్ రమ్మీ, పోకర్ వంటి జూదాలపై నిషేధం విధించే దిశగా జగన్ సర్కారు తొలి అడుగు వేసింది. సమాజంలో పెడధోరణులకు కారణం అవుతుందన్న కారణంతో ఏపీ గేమింగ్ యాక్ట్ -1974కి సవరణలు చేస్తూ, రమ్మీ, పోకర్ పై నిషేధం విధించే తీర్మానానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆన్ లైన్ గేమ్ లు నిర్వహించేవారికి ఏడాది జైలు శిక్ష, ఆడేవారికి ఆరు నెలలు జైలుశిక్ష విధించేలా జీవో తీసుకొచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఈజీ మనీకి అలవాటుపడ్డ చాలామంది ఇప్పుడు ఆన్ లైన్లో జూదం ఆడేందుకు అలవాటు పడ్డారు. ఎవరూ చూడరు అనే ధైర్యంతో వీరంతా మొబైల్ ఫోన్స్ ద్వారా ఈ గేమ్స్ ఆడుతూ డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఏపీలో లక్షలాది కుటుంబాలను ఈ వ్యసనం నాశనం చేస్తోంది. లాక్ డౌన్ లో ఈ మహమ్మారి మరింత విజృంభించింది.
చాప కింద నీరులా పాకుతున్న దీనిపై ఏపీ సర్కారు కఠిన నిర్ణయం తీసుకునేందుకు సాహసించింది. కేబినెట్ భేటీకి ముందుగా దీనిపై ఎవరికీ సమాచారం లేకపోయినా మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాల్లో ఇదే ప్రముఖంగా నిలిచింది.
ఇక ప్రధానంగా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇకపై ఉచిత విద్యుత్ వృథాకు అడ్డుకట్ట పడుతుంది. అదే సమయంలో రైతులు నాణ్యమైన విద్యుత్ ని కూడా పొందుతారు.
ఇక సచివాలయ వ్యవస్థలో డివిజనల్ డెవలప్ మెంట్ ఆఫీసర్స్ పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు కోసం విడుదల చేసిన జీవోకి, ప్రకాశం బ్యారేజ్ దిగువన మరో రెండు కొత్త బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనకు, వరికపూడిసెల ఎత్తిపోతల పథకం సర్వే, ప్రాజెక్ట్ రిపోర్ట్ కు, బాబూ జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఫేజ్-2 నిర్మాణ ప్రతిపాదనలకు, రాయలసీమలో 14 రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణాల భూకేటాయింపు నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
మావోయిస్ట్ పార్టీ, దాని అనుబంధ సంఘాలపై మరో ఏడాది పాటు నిషేధం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఫిషరీస్ యూనివర్సిటీ కోసం ఇచ్చిన ఆర్డినెన్స్ ని కూడా ఆమోదించింది కేబినెట్.