మరో కొత్త బ్యాచ్.. బాంబ్ పేల్చిన బాలినేని..!

ఏపీలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై చాన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కరోనా టైమ్ కదా.. మరికొన్నాళ్లు జగన్ వేచి చూస్తారేమో అనుకుంటున్న సందర్భంలో మంత్రి బాలినేని బాంబు పేల్చారు.  Advertisement ఈ దఫా మంత్రివర్గంలో…

ఏపీలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై చాన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కరోనా టైమ్ కదా.. మరికొన్నాళ్లు జగన్ వేచి చూస్తారేమో అనుకుంటున్న సందర్భంలో మంత్రి బాలినేని బాంబు పేల్చారు. 

ఈ దఫా మంత్రివర్గంలో అన్నీ కొత్త మొహాలు కనిపిస్తాయని చెప్పారు. మరి అందరూ కొత్తవారిని తీసుకొస్తే, పాతవారి పరిస్థితి ఏంటి..? మంత్రులంతా మాజీలైపోతే నియోజకవర్గాల్లో వారి పరపతి ఏంకాను..? ఈ ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానాలు లేవు.

నన్ను కూడా మార్చేయండి..

మంత్రివర్గంలోకి కొత్తవారిని తీసుకుంటామని ఇటీవల సీఎం జగన్ తనతో చెప్పారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నికల సందర్భంలో మాట్లాడారు. 

కొత్తవారిని తీసుకునే పాలసీని అమలు చేస్తే తనని కూడా మార్చేయాలని జగన్ కు చెప్పానని అన్నారు బాలినేని. మంత్రి పదవి లేకపోయినా తనకు బాధ లేదని, తాను పార్టీ కోసం కట్టుబడి ఉన్నానని చెప్పారు.

బాలినేని వ్యాఖ్యలతో కలకలం..

మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం రోజే.. రెండున్నరేళ్ల తర్వాత కొత్తవారికి అవకాశమిస్తామని చెప్పారు సీఎం జగన్. అయితే ఆ సమయం వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ఎక్కడా దానికి సంబంధించిన సిగ్నల్స్ రాలేదు. 

కనీసం సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా లీకులు లేవు, అటు జగన్ కూడా నోరు తెరిచి ఎప్పుడూ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులపై మాట్లాడలేదు.

తొలిసారి బాలినేని కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై స్పందించారు. అంతా కొత్తవారికే పదవులుంటాయని హింట్ ఇచ్చేశారు. తనతో సహా ఇప్పుడున్న మంత్రులంతా మాజీలు కావాల్సిందేనంటూ పరోక్షంగా తేల్చి చెప్పారు. 

అదే నిజమైతే.. జగన్ మరో సంచలనం సృష్టించినట్టే. ఇప్పటి వరకూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రెండేళ్లకు పూర్తిగా కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన సీఎం లేరు. అదే జరిగితే జగన్ తోనే ఆ ఆనవాయితీ మొదలవుతుంది.

మరి ఎన్నికల సంగతేంటి..?

రాబోయే సార్వత్రిక ఎన్నికలు, లేదా ముందస్తు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని జగన్ తన మంత్రివర్గాన్ని తయారుచేస్తారని అంతా అనుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్ టీమ్ రెడీ అవుతుందంటూ ఊహాగానాలు వినిపించాయి. 

ఇందులో భాగంగా కొంతమంది మంత్రులు అదే పదవుల్లో కొనసాగుతారని, ఓ 60శాతం మంత్రులు మారుతారని అనుకున్నారంతా. కానీ బాలినేని బాంబ్ పేల్చారు. మంత్రివర్గం పూర్తిగా ప్రక్షాళన కాబోతోంది. ఈ విషయంలో జగన్ మాట తప్పడం లేదు.