ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రతి రోజూ వేల సంఖ్యలో (దేశంలోనే గరిష్టంగా) కరోనా పరీక్షలు నిర్వహిస్తూ, మరోవైపు పూర్తిస్థాయిలో వైద్య సదుపాయాలు కల్పిస్తున్న కారణంగా.. ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుతూ, కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 103 మంది డిశ్చార్జ్ అవ్వగా.. కొత్తగా 25 కేసులు (అందులో 5 వలస కార్మికులవి) మాత్రమే నమోదయ్యాయి.
నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటవరకు 9880 శాంపిల్స్ ను పరీక్షించారు అధికారులు. వీటిలో 25 కరోనా పాజిటివ్ కేసులు లెక్కతేలాయి. కొత్తగా నమోదైన కేసుల్లో శ్రీకాకుళం నుంచి ఒకేసారి 7 కేసులు బయటపడడం బాధాకరం. అటు చిత్తూరు-గుంటూరు నుంచి చెరో 4, కర్నూలు-ప్రకాశం-విశాఖ నుంచి చెరో 3 కొత్త కేసులు, నెల్లూరు నుంచి ఒక కేసు నమోదయ్యాయి.
రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో ప్రకాశంలో 3, చిత్తూరు-కర్నూలు నుంచి చెరో రెండు కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చిన వాళ్లకు సంబంధించినవిగా గుర్తించారు. మొత్తంగా చూసుకుంటే.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లలో 150 మందికి పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. వీళ్లలో మహారాష్ట్ర నుంచి 101 మంది, గుజరాత్ నుంచి 26, ఒరిస్సా నుంచి 10, రాజస్థాన్ నుంచి 11 మంది, కర్నాటక-పశ్చిమ బెంగాల్ నుంచి చెరొకరు ఉన్నారు.
ఇక కరోనా నుంచి కోలుకున్న వారి విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 103 మంది కోలుకున్నారు. వీళ్లలో కృష్ణ నుంచి 42, గుంటూరు నుంచి 18, కర్నూలు నుంచి 15, నెల్లూరు నుంచి 13, విశాఖ నుంచి 7, పశ్చిమ-కడప నుంచి చెరో ముగ్గురు, తూర్పు-అనంతపురం నుంచి చెరొకరు ఉన్నారు. తాజాగా కరోనా కారణంగా కృష్ణ జిల్లాలో ఒకరు మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 50కు చేరింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2230 కేసులు ఉండగా.. 1433 మంది (సగం కంటే ఎక్కువ) పూర్తిగా కోలుకున్నారు. 50 మంది మరణించగా.. 747 మందికి చికిత్స అందుతోంది.