ఏపీ ముఖ్యమంత్రికి ఎన్నారైల విన్నపం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటన కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఎన్నారైలు అందరిలో జగన్ డాలస్ ప్రసంగం ఒక చర్చనీయాంశమయ్యింది. పెట్టుబడుల సమీకరణకు అక్కడికి వెళ్లిన జగన్… రండి, పెట్టుబడులు…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటన కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఎన్నారైలు అందరిలో జగన్ డాలస్ ప్రసంగం ఒక చర్చనీయాంశమయ్యింది. పెట్టుబడుల సమీకరణకు అక్కడికి వెళ్లిన జగన్… రండి, పెట్టుబడులు పెట్టండి, మన ఊరిని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన వారి, మన ఊరి అభివృద్ధిలో పాలుపంచుకుందాం… అని పిలుపునిచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. ఎన్నారైలకు ఇది సంతోషకరమే అయినా… ఇప్పటికే ప్రభుత్వంలో భాగస్వామి అయిన తమ గోడును ముఖ్యమంత్రికి చెప్పుకోవాలని ఎన్నారైలు, ముఖ్యంగా తెలుగు ఎన్నారైలు భావిస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఎన్నారైల ఐక్యత కోసం ప్రారంభించిన ఏపీ ఎన్నార్టీ సొసైటీని కొనసాగించాలనుకోవడంపై ఎన్నారైలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వంలో భాగస్వాములైన తాము అప్పటి తమ పెట్టుబడుల గురించి ఆందోళనలో ఉన్నారు. ఏపీ ఎన్నార్టీ ఆధ్వర్యంలో అప్పటి ఏపీ ఎన్నార్టీ ఛైర్మన్ డాక్టర్ వేమూరి రవి ‘‘ఏపీ ఎన్నార్టీ ఐకానిక్‘‘ అనే ఒక పెట్టుబడుల హబ్ నెలకొల్పడానికి శ్రీకారం చుట్టారు.

గత ప్రభుత్వం దీనిని ప్రోత్సహించింది. అమరావతిలో ఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణానికి భూమిపూజ కూడా చేశారు. 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 33 ఫ్లోర్లుగా ఎన్నార్టీ టవర్ నిర్మించాలని ప్రణాళిక రచించారు. 158 మీటర్ల ఎత్తులో, రూ.500 కోట్ల అంచనాతో ఎన్నార్టీ టవర్ నిర్మాణానికి సిద్ధమయ్యారు. అయితే, ప్రభుత్వ మారిన అనంతరం దాని గురించి ముందడుగు పడలేదు. దీంతో అప్పట్లో పెట్టబడులు పెట్టిన వారితో పాటు… మళ్లీ పెట్టుబడులు పెట్టాలనుకునే వారు కూడా ఆందోళనలో ఉన్నారు.

వారి ఆందోళనకు కారణం ఒక ప్రభుత్వ నిర్ణయాలు మరో ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లకపోవడం. కొన్ని దశాబ్దాల ముందుచూపుతో పెట్టే పెట్టబడులకు సరైన భరోసా ఉంటే… పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికీ  సిద్ధంగా ఉన్నామని… వారు అంటున్నారు. ఎందుకంటే… భవిష్యత్తులో మళ్లీ ప్రభుత్వం మారితే మళ్లీ తాము ఆందోళనలో పడకుండా ఉంటామన్నది వారి ఆలోచన. పార్టీలకు పరిమితం కావాల్సిన రాజకీయాలు ప్రభుత్వాలను తాకితే… ఆర్థిక వ్యవస్థ స్థిమితంగా ఉంటుందన్న భరోసా ఉండదు అని… కాబట్టి ప్రభుత్వం ఎన్నారైల పెట్టబడుల విషయంలో ఒక ప్రకటన చేయాలని వారు కోరుతున్నారు.

భవిష్యత్తుకు భరోసా లేకుండా ఎవరైనా ముందుకు వస్తారా? అని ఎన్నారైలు ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఐకాన్ ప్రాజెక్టును ఆపేయాలనుకున్నా అందులో పెట్టబడి పెట్టిన వారిని, భాగస్వాములు అయిన వారిని ప్రభుత్వం కొత్త దారిచూపుతూ ముందుకు నడిపిస్తే ఎన్నారైల్లో భరోసా ఉంటుంది కదా అన్నదా వారి అభిలాష.

జగన్నాటకంలో మంత్రులకు సీన్‌ సితారే?