శాసన మండలి రద్దు ఎందుకు జరుగుతోంది.? ఇంకెందుకు, శాసన మండలిలో అధికార పక్షానికి ప్రతిపక్షం అడ్డు పడుతుండడం వల్లే.! 'ఇంకో ఏడాదిన్నరలోనే శాసన మండలిలో అధికార పక్షానికి మెజార్టీ దక్కుతుంది.. ఈలోగా ఎందుకు అంత తొందర..' అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు వెటకారాలు చేస్తున్నారుగానీ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కొన్ని కార్యక్రమాలకు మండలిని అడ్డం పెట్టుకుని టీడీపీ అడ్డుపడుతున్నప్పుడు.. ఆ మండలిని రద్దు చేయడం తప్ప ప్రభుత్వం ముందు ఇంకో మార్గం లేదు
ఇంగ్లీషు మీడియం విషయమై రూపొందించిన బిల్లుని శాసన మండలి అడ్డుకున్నప్పుడే శాసన మండలి రద్దుకి బీజం పడింది. అయితే, అప్పట్లోనే మండలి రద్దు గురించి ప్రతిపాదిస్తే తొందరపాటు అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాస్త ఆలోచించారు. ఫలితం, మూడు రాజధానుల బిల్లుకి టీడీపీ శాసన మండలిలో అడ్డు తగలడం. నిజానికి, వైఎస్ జగన్ ముందు మరో ఆప్షన్ కూడా వుంది.. ఎమ్మెల్సీలను తనవైపుకు తిప్పుకోవడం.
అయితే, వైఎస్ జగన్.. చంద్రబాబులా ఆలోచించలేదు. పార్టీ ఫిరాయింపుల విషయమై ఖచ్చితమైన అభిప్రాయంతో వున్నారాయన. అది తెలిసే, తెలుగుదేశం పార్టీ డబుల్ గేమ్ ప్లాన్ చేసింది.. బొక్క బోర్లా పడింది. శాసన మండలి రద్దు కాబోతోంది. అయితే, 'దుర్మార్గం..' అంటూ తెలుగుదేశం పార్టీ గుస్సా అవుతోంది.. ఇక ముందు నానా యాగీ చేయబోతోంది. 'రెండేళ్ళకు పైనే సమయం పడుతుంది..' అంటూ టీడీపీ అప్పుడే సన్నాయి నొక్కులు నొక్కుతున్న విషయం విదితమే.
మరోపక్క, 'మీరే చూస్తారుగా..' అంటోంది వైసీపీ. ఒకవేళ వైసీపీ అంచనాలే నిజమైతే.. అతి త్వరలోనే మండలి రద్దు పూర్తిగా జరిగిపోవచ్చు. ఇక, అప్పుడు టీడీపీ ఎంత గగ్గోలు పెట్టినా ఉపయోగం లేదు. 'మేం అధికారంలోకి వస్తే మళ్ళీ మండలిని పునరుద్ధరిస్తాం..' అంటోంది టీడీపీ. అసలు టీడీపీ, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చే పరిస్థితి వుందా.? అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి.
మండలి రద్దుతో తెలుగుదేశం పార్టీకి స్వయానా చంద్రబాబే మరణ శాసనం రాసేసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించకూడదన్న నిర్ణయాన్ని కాస్సేపు వైఎస్ జగన్ పక్కన పెడితే, శాసన సభలో టీడీపీ బలం సింగిల్ డిజిట్‌కి పడిపోవడానికి.. సింగిల్ డే కూడా ఎక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే.. చంద్రబాబు విషయంలో ఇంకా వైఎస్ జగన్ 'దయ' చూపిస్తున్నట్లే లెక్క.