ఎన్నికల కమిషన్ తో అధికార వైసీపీ డిఫెన్స్ పాలిటిక్స్

అనేక తర్జనభర్జనలు తర్వాత స్థానిక ఎన్నికలు ఏపీలో జరుగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముందు ఎన్నికల కమిషనర్ కు అధికార పార్టీకి మధ్య రాజకీయ వైరం ఎలా ఉన్నదో ప్రక్రియ మొదలయిన తరవాత ఇంకా ఎక్కువ…

అనేక తర్జనభర్జనలు తర్వాత స్థానిక ఎన్నికలు ఏపీలో జరుగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముందు ఎన్నికల కమిషనర్ కు అధికార పార్టీకి మధ్య రాజకీయ వైరం ఎలా ఉన్నదో ప్రక్రియ మొదలయిన తరవాత ఇంకా ఎక్కువ అవుతుంది.

అధికార పార్టీ వ్యూహాత్మక తప్పిదం.

ఎన్నికల సంఘం గత మార్చిలో ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వేసింది. అక్కడ ప్రారంభమయిన వైరం నేటికి సాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా నిమ్మగడ్డ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారని విమర్శలు చేసారు. అధికార పార్టీ అలాంటి వారితో వ్యవహరించేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

న్యాయ పోరాటాన్ని , రాజకీయ పోరాటాన్ని కలగాపులగం చేసింది. ఎన్నికల మధ్యలో ఉండగా కమిషనర్ సర్వీసును ప్రభావితం చేసే ఎలాంటి చర్యలు కోర్టు ముందు నిలవదు అని తెలిసి తప్పుచేసింది. కేంద్రం ఒక్కరే ఉన్న కమిషనర్ స్థానే మరో ఇద్దరిని చేర్చింది. చేస్తే అలాంటి ప్రయత్నాలు చేయాలిగాని అందుకు భిన్నంగా వ్యవహరించి తప్పుచేసింది.

నాడు సుప్రీంకోర్టు తదుపరి ఎన్నికలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వంతో  సంప్రదించాలని ఆదేశించినది. ఇపుడు ఎన్నికలు వద్దు అని ప్రభుత్వం భావిస్తే దాని చుట్టూ న్యాయ పోరాటం చేయాలి. ప్రభుత్వంతో సంప్రదించడం అంటే కేవలం సమాచారం ఇవ్వడం మాత్రమే కాదు. హేతు బద్ధమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవడం కూడా.

కానీ ఎన్నికల కమిషనర్ అందుకు భిన్నంగా వ్యవహరించారు ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తనవాదనలో ఎక్కడా చేర్చలేదు. అఖిల పక్షం సమావేశంలో ఎక్కువ పార్టీలు ఎన్నికలను కోరుకోలేదు. మెజారిటీ పార్టీల అభిప్రాయాలకు భిన్నంగా కమిషన్ నిర్ణయం తీసుకుంది.

వ్యతిరేకంగా ఉన్న పార్టీలను , సంస్థలను , ప్రముఖులను అధికార పార్టీ కలుపుకొని పోయే ప్రయత్నాలు కూడా చేయలేదు. ఫలితంగా అధికార పార్టీ ఒంటరి అయినది. రాజకీయాలలో బలాబలాలతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీల అభిప్రాయాలకు ప్రజలలో విలువ ఉంటుంది అన్న కనీస రాజకీయ పరిణితిని వైసీపీ ప్రదర్శించలేదు.

కీలక అంశాన్ని పట్టించుకోలేదు

గత ఏడాది ఎన్నికల సంఘం వాయిదా వేసినప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి తదుపరి ఎన్నికలను మొదలు పెడుతాము అని అధికారిక ప్రకటన విడుదల చేసారు. మరి ఇప్పుడు అందుకు భిన్నంగా కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం తన న్యాయ పోరాటంలో ఎక్కడ ఈ అంశాలు చర్చకు పెట్టలేదు. కరోనా , వ్యాక్సినేషన్ మాత్రమే చూపించి వాయిదా కోరింది. ఈ మొత్తం వ్యవహారంలో కమిషన్ – రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అంగీకారంతో మాత్రమే వాయిదా పడింది. అలాంటి వాతావరణం ఏపీలో లేదు అని తెలిసి అవే అంశాలను పరిగణనలోకి తీసుకుని కోర్టుకు వెళ్లి బంగపడింది.

కమిషన్ తో పోరాటం రాజకీయ తప్పిదం

ఎన్నికలు ప్రారంభం అయిన తర్వాత అధికార పార్టీ తనకున్న సానుకూల అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికలలో మంచి విజయం సాధించి న్యాయ పోరాటంలో తడబడినా ప్రజలలో తమకు తిరుగులేదని నిరూపించే పనిలో ఉండాలి.

అధికార పార్టీ ముఖ్య నేతలు కమిషనర్ ను విమర్శిస్తుంన్నారు. ప్రతి విమర్శకు ప్రతిగా నిమ్మగడ్డ నోటీసులు ఇస్తున్నారు. కమిషనర్ ఎంత ఉన్నత పదవిలో ఉన్నా వారు ఒక వ్యక్తి మాత్రమే. అలాంటి వారిపై యావత్తు ప్రభుత్వ యంత్రాంగం దాడి చేస్తోంది అన్న వాతావరణం అధికార పార్టీకి ప్రయోజనకరం ఏమాత్రం కాదు. రేపు మంచి ఫలితాలు సాధించినా అంత అధికార దుర్వినియోగం అన్న విమర్శలు చేయడానికి ప్రతిపక్ష పార్టీలకు అధికార పార్టీ తానే అవకాశం ఇస్తుంది.

మొత్తంగా గత ఏడాది నుంచి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డతో అధికార వైసీపీ న్యాయ పోరాటాన్ని – రాజకీయ పోరాటాన్ని మిళితం చేసి ప్రతికూల ఫలితాలను చెవిచూస్తోంది. మరో వైపు విభిన్న రాజకీయ పార్టీలు ఉన్న రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని , వ్యక్తులను , సంస్థలను కలుపుకొని పోయే ప్రయత్నం కూడా చేయక ఒంటరి అవుతుంది.

– మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి

రాజకీయ విశ్లేషకులు
9490493436