విశాఖ పాలనారాజధానిగా చేసుకోవాలని జగన్ సర్కార్ దూకుడు మీద ఉంది. అందుకోసం తెరవెనక కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. విశాఖ సిటీకి దగ్గరగా ఉన్న ప్రభుత్వం భూముల వేట మొదలైంది. సువిశాలమైన ప్రాంగణంలో కొత్త సచివాలయం నిర్మాణానికి కూడా రంగం సిధ్ధం చేస్తున్నారు.
విశాఖలో ఇపుడు కాపులుప్పాడ పేరు బాగా నలుగుతోంది. ఇక్కడే కొత్త సచివాలయం వస్తుందని అంటున్నారు. నిన్నటివరకూ మధురవాడలోని ఐటి హిల్స్ మిలీనియం టవర్స్ లో సచివాలయం అనుకున్నారు. కానీ ఇపుడు కాపులుప్పాడలో ఉన్న 1350 ఎకరాల ప్రభుత్వ భూములను సీరియస్ గా పరిశీలిస్తున్నారు.
ఇక్కడ 250 ఎకరాల్లో సచివాలయం ఏర్పాటు చేసుకోవాలని జగన్ సర్కార్ ఆలోచనలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఒకప్పుడు ఇక్కడ అదాం సంస్థ ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తానంటే కొండను చదును చేసి మరీ చంద్రబాబు సర్కార్ లే అవుట్లు కూడా దగ్గరుండి వేయించింది. అంతన్న ఇంతన్న అదాం చివరికి మూడు వేల కోట్ల పెట్టుబడులకే పరిమితం కావడంతో వైసీపీ సర్కార్ కి ఈ భూమి అందుబాటులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
దాంతో కాపులుప్పాడ కొండ మీదనే ఏపీ సచివాలయంతో పాటు ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతుందని చెబుతున్నారు.