ఓవైపు పీఆర్సీపై గొడవ, మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు 14రోజుల సమ్మె నోటీసు ఇచ్చి సమ్మెలోకి పోవాలంటే ఫిబ్రవరి 7 వరకు టైమ్ ఉంది. కానీ ఈలోపు ట్రెజరీ ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. లాజికల్ గా ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోలు ఇంప్లిమెంట్ చేయాలంటే ట్రెజరీ ఉద్యోగులు కొత్త జీతాలకు అనుగుణంగా ఆ బిల్లుల్ని ప్రాసెస్ చేయాలి. వారు బిల్లులు ప్రాసెస్ చేస్తే కొత్త పీఆర్సీ అమలులోకి వచ్చినట్టే. అదే జరిగితే ఉద్యమానికి వారు ద్రోహం చేసినట్టే.
ఒకవేళ బిల్లులు ప్రాసెస్ చేయలేమని వెనకడుగు వేస్తే.. సమ్మె నోటీసు పీరియడ్ లో పని చేయకుండా ఉద్యోగ నిబంధనల్ని ధిక్కరించినట్టే. మిగతా ఉద్యోగులంతా నోటీస్ పీరియడ్ లో ఎవరి పని వారు చేసుకున్నా ఎవరికీ ఇబ్బంది లేదు. ట్రెజరీ ఉద్యోగులు పని చేస్తే తమకి తామే ద్రోహం చేసుకున్నట్టు. చేయకపోతే క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దీంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
తగ్గేది లేదు..
ఉద్యోగుల్లో ఒక్కసారిగా ప్రభుత్వంపై అనుమానాలు మొదలయ్యాయి, బలపడుతున్నాయి. సీఎం జగన్ పై తమకి నమ్మకం ఉందంటూనే ప్రభుత్వం తమకి వ్యతిరేకంగా పీఆర్సీ ప్రకటించిందని విమర్శిస్తున్నారు. ఉద్యోగ సంఘాల ఆందోళన ఈ స్థాయిలో ఉంటుందని, ఏకంగా సమ్మెకు సిద్ధమవుతురాని ప్రభుత్వం ఊహించి ఉండదు.
కానీ ఒకసారి మెత్తబడితే.. భవిష్యత్తులో మరిన్ని త్యాగాలు చేయాల్సి వస్తుందేమోనన్న భయం ఉద్యోగుల్లో ఉంది. అందుకే ఇప్పుడే తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతున్నా కూడా.. సంక్షేమ పథకాల్లో కోత పెట్టనప్పుడు, ఉద్యోగుల జీతాల్లో కోత ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
సమ్మె జరిగే లోపు సమస్య పరిష్కారం అవుతుందా..?
ఉద్యోగుల సమ్మెకు 2వారాల గడువు ఉంది. అంటే ఆలోగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి సమస్యకి ఓ మంచి పరిష్కారం సాధించొచ్చు. కానీ ఇప్పుడు ఆ రెండు వారాల మధ్యలో జీతాల తేదీ వచ్చేసింది. అంటే ఇప్పటికిప్పుడు బిల్లులు ప్రాసెస్ చేస్తేనే ఫిబ్రవరి 1న ఉద్యోగులు జీతాలు అందుకుంటారు. బిల్లులు ఆలస్యం అయితే జీతాలు కూడా ఆలస్యం అవుతాయి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.
ట్రెజరీ ఉద్యోగులు పాత బిల్లుల ప్రకారం జీతాలు ఇవ్వలేని పరిస్తితి. కొత్త బిల్లుల ప్రకారం ప్రాసెస్ మొదలు పెడితే.. తమకి తామే మోసం చేసుకున్నట్టు లెక్క. అందుకే అన్ని విభాగాల కంటే ఇప్పుడు ట్రెజరీ విభాగం, పే అండ్ అకౌంట్స్ విభాగం కీలకంగా మారాయి. ఆ రెండు శాఖల ఉద్యోగులు కూడా సహాయ నిరాకరణకే సిద్ధమంటున్నారు. మరి వీరిని ప్రభుత్వం బుజ్జగిస్తుందా.. లేక బెదిరించి పని చేయించుకుంటుందా అనేది తేలాల్సి ఉంది. ట్రెజరీ సిబ్బంది మాత్రం దయచేసి తమపై ఒత్తిడి తీసుకురావొద్దని ముందుగానే కోరుతున్నారు.