తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలన్నిటినీ ప్రత్యక్షంగా చూసిన జగన్ నవరత్నాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నది అందులో ఒకటి. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యాన్నిపూర్తిగా నిషేధిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటనేది కొందరి వాదన, అసలు మద్యపాన నిషేధం అమలు చేయగల సత్తా జగన్ లో ఉందా అన్నది మరికొందరి అనుమానం.
వీటన్నిటి మధ్య, విడతలవారీగా మద్యాన్ని నిషేధించే దిశగా జగన్ అడుగులు వేయడం మొదలు పెట్టారు. తొలి దశలో వైన్ షాపులు, బార్ల లైసెన్స్ లు పూర్తిగా తగ్గించేశారు. అమ్మకాలన్నిటినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి టైమ్ టేబుల్ పెట్టారు. మలి దశలో రేట్లు పెంచి, ఆకర్షణీయమైన బ్రాండ్లు తగ్గించేశారు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా జగన్ మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది.
ఆంక్షలు సడలిస్తూ మద్యం షాపులు తెరిచింది ప్రభుత్వం, రేట్లు విపరీతంగా పెంచేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో వ్యసనపరుల్ని మద్యానికి దూరం చేయడం కోసమే మందు రేట్లు పెంచినట్టు, మద్యపాన నిషేధంలో ఇది మరో అంకం అని చెప్పుకొచ్చింది ప్రభుత్వం. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. రేట్లు పెంచిన కారణంగా మందు తాగేవారి సంఖ్య తగ్గింది కానీ అది 10శాతం మాత్రమే. వారు కూడా మోతాదు తగ్గించుకున్నారు కానీ అలవాటు మానుకోలేదు.
ఇక మిగతావారంతా కుటుంబ సభ్యులను కష్టపెడుతున్నారు, తమ కష్టార్జితాన్నంతా వైన్ షాపుకే తగలేస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత ఏపీలో మద్యం అమ్మకాల గణాంకాలు చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. అంటే రేట్లు పెంచి, బ్రాండ్లు తగ్గించినంత మాత్రాన మందుబాబుల్లో మద్యంపై వ్యామోహం తగ్గలేదన్నమాట. మానసిక శాస్త్రవేత్తలతో పాటు సగటు బాధిత మహిళల అంచనా ఇది. ఈ మేరకు చాలా ఉదంతాల్ని, వీడియోల్ని మనం చూస్తూనే ఉన్నాం.
లాక్ డౌన్ సడలింపు తర్వాత మందుబాబుల కుటుంబాల్లో మరింత రచ్చరేగిన మాట వాస్తవం. దీనిపై కొంతమంది మహిళలు స్థానిక నేతలకు తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. మరికొందరు వైన్ షాపుల ముందు ఆందోళనలకు దిగుతున్నారు. మద్యం అమ్మకాలపై జరుగుతున్న రగడను పూర్తిగా ప్రతిపక్షాల నిందగా కొట్టిపారేయలేం. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో మద్యం షాపుల రీ-ఓపెన్ చిచ్చుపెట్టింది. మందుబాబులు తమకున్న వ్యసనాన్ని వదిలిపెడితేనే ఫలితం ఉంటుంది కానీ, మందు రేట్లు పెంచినంత మాత్రాన ఉపయోగం ఉండదనేది మహిళల వాదన, ఆవేదన.
అయితే మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని దశలవారీగా ఇతర రూపాల్లో సమకూర్చుకుంటూ మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలనేది ప్రభుత్వం ఆలోచన. అసలు మద్యం అందుబాటులో లేకుండా చేస్తే కొత్త తరం అయినా దీని బారిన పడకుండా ఆరోగ్యంగా, బాధ్యతాయుతంగా ఉంటుంది. ఈ క్రమంలో జరిగే ప్రయోగాలన్నిటికీ సంధికాలంలో ఉన్న జనరేషన్ కాస్త నష్టపోవాల్సిందే. అప్పుడే భవిష్యత్ తరాలు లాభపడతాయి. ఈ దిశగా ఆలోచిస్తున్న ప్రభుత్వం మద్యం రేట్లపై పునరాలోచిస్తుందా? మహిళల ఆవేదన అర్థం చేసుకుంటుందా? వేచి చూడాలి.