దేశంలో మొదట్లోనే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నది వైద్య రంగంలో పని చేస్తున్న సిబ్బందే. ఫస్ట్ వేవ్ లో అనేక మంది వైద్య సిబ్బందికి కరోనా రాగా, సెకెండ్ వేవ్ లో తొలి దశతో పోలిస్తే చాలా తక్కువ స్థాయిలోనే వైద్యులు కరోనా బారిన పడ్డారనే వార్తలు వచ్చాయి. ఇబ్బడిముబ్బడిగా కేసులు రావడంతో డాక్టర్లు చాలా మంది ఔట్ పేషెంట్లను ట్రీట్ చేశారు.
రోజుకు పదుల సంఖ్యలో కరోనా పేషెంట్లను ట్రీట్ చేసిన డాక్టర్లు కోకొల్లలు. ఇన్ పేషెంట్ వార్డుల్లోనూ కరోనా రోగులతో, ఔట్ పేషెంట్లుగానూ వారితోనే సహవాసం చేశారు చాలా మంది వైద్యులు. అయితే చాలా ధైర్యంగా ట్రీట్ మెంట్ అందించారు వైద్యులు. వారి ధైర్యానికి కారణం..వ్యాక్సినేషనే అని వేరే చెప్పనక్కర్లేదు.
50 యేళ్ల వయసు స్థాయి డాక్టర్లు కూడా కరోనా రోగులకు సెకెండ్ వేవ్ లో వైద్యం అందించారు. ఇక నర్సులు, మెడికల్ షాపు సిబ్బంది పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు. మెడికల్ షాపుల చుట్టూ కరోనా రోగులు గుమికూడిన పరిస్థితుల్లో కూడా.. అందులోని సిబ్బంది యథారీతిన పనులు చేశారు.
వారిలో కొందరు మాస్కులు వేసుకుని కనిపించారు, ఇక పగలంతా మాస్కులు వేసుకునే ఓపిక లేక తీసేసిన వారూ ఉండనే ఉంటారు. అక్కడే తినడం, అక్కడే మకాం అన్నట్టుగా సాగింది మెడికల్ షాపుల వాళ్ల పని. మరి వీరందరి ధీమా ఏమిటి? అనేది ప్రశ్నార్థకంగా నిలిచింది పేషెంట్లకు కూడా. బహుశా వ్యాక్సినే వారికి ఆ ధైర్యాన్ని ఇచ్చిందని స్పష్టం అవుతోంది.
ఈ అంశం గురించి అపోలో హాస్పిటల్స్ తన అధ్యయనాన్ని వెల్లడించింది. తమ ఆసుపత్రుల్లో పని చేసే సిబ్బందిపైనే ఆ సంస్థ అధ్యయనం చేసిందట. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఆసుపత్రి వర్గాలు సిబ్బందికి తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించాయి.
ఈ నేపథ్యంలో సెకెండ్ వేవ్ లో ఆ సిబ్బంది పరిస్థితి ఏమిటనే అంశం గురించి అపోలో స్టడీ చేసిందట. దాని ప్రకారం అపోలో సిబ్బంది 31 వేల స్థాయిలో ఉంది. వారందరికీ దాదాపు వ్యాక్సినేషన్ జరిగింది. 91 శాతం మంది కోవీ షీల్డ్ టీకా తీసుకున్నారు. కేవలం తొమ్మిది శాతం మంది మాత్రమే కోవ్యాగ్జిన్ తీసుకున్నారు.
సెకెండ్ వేవ్ ప్రారంభానికి మునుపే వీరందరికీ వ్యాక్సినేషన్ జరిగిందనుకుంటే.. వీరిలో ఇప్పటి వరకూ కేవలం నాలుగు శాతం మంది మాత్రమే కరోనా పాజిటివ్ గా తేలారట. 95 శాతం మంది సెకెండ్ వేవ్ లో కరోనాకు గురి కాలేదని అపోలో ప్రకటించింది. పాజిటివ్ గా తేలిన 4.28 మంది స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో ట్రీట్ మెంట్ తీసుకోవడం, ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడం చేశారట. ఇద్దరంటే ఇద్దరు మాత్రమే ఐసీయూ వరకూ వెళ్లారట. వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పని చేయడం వల్లనే ఈ సానుకూల పరిస్థితి ఏర్పడిందని అపోలో ఈ అధ్యయనం ద్వారా చెబుతోంది.
గమనించాల్సిన అంశాలు ఏమిటంటే.. సెకెండ్ వేవ్ లో అసుపత్రులను కరోనా రోగులు చుట్టుముట్టారు. కాబట్టి.. ఆసుపత్రి సిబ్బందికి కరోనా ప్రమాదం ఎక్కువ అని తేటతెల్లం అవుతోంది. అయినా కూడా 31 వేల మంది సిబ్బందిలో ఐదు శాతం లోపు మంది, అంటే దాదాపు ఆరు వందల మందికి మాత్రమే కరోనా పాజిటివ్ గా తేలడం సానుకూల అంశమే.
ఎవ్వరికీ ప్రాణం మీదకు రాకపోగా అంతా బయటపడ్డారు. వ్యాక్సిన్ల ప్రభావం గురించి ఇది మంచి అధ్యయనమే అని చెప్పాలి. సామాన్య జనాలకు వ్యాక్సిన్లు ఇచ్చి, వారికి కరోనా వచ్చిందా రాలేదా.. అనే లెక్కలేయడం కన్నా, కరోనా రోగులతో సహవాసం చేసే వైద్య సిబ్బందిపై జరిగిన అధ్యయనం అర్థవంతమైనది అని చెప్పవచ్చు. అలాగే గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం.. వైద్య సిబ్బంది చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఉంటుంది.
మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడి ఉంటారు. ఈ తరహా రక్షణ కూడా వారిని కొంత వరకూ రక్షించి ఉంటుంది. నిరంతరం కరోనా రోగులు చుట్టూరా ఉన్నప్పటికీ.. మాస్కులు, వ్యాక్సిన్ లు రక్షిస్తాయని చెబుతోంది ఈ అధ్యయనం.