విశాఖలో వైసీపీ పరిస్థితి ఏంటి. ఈ ఏడు నెలలలో మార్పులు ఏమైనా వచ్చాయా. వైసీపీ విధానాలకు జనం జై కొడుతున్నారా. విశాఖ రాజధాని మీద జనాల మోజు ఎంత వరకూ ఉంది, వంటి అనేక ప్రశ్నలకు సమాధానం ఎంతో కొంత దొరికే అవకాశం ఇపుడు ఉంది.
ఎందుకంటే జీవీఎంసీలో రెండు వార్డులకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి. అందులో ఒకటి టీడీపీది, రెండవది వైసీపీది. 31, 61 వార్డులలో గెలిచిన ఇద్దరు కార్పోరేటర్లు అనారోగ్యంతో మరణించడంతో వచ్చిన ఉప ఎన్నికలు ఇవి.
ఇక 31వ వార్డు తీసుకుంటే టీడీపీకి ఒక విధంగా కంచుకోట. అక్కడ మార్చిలో జరిగిన జీవీఎంసీ పోరులో ఆ పార్టీకి చెందిన కార్పోరేటర్ గెలిచారు. అంతకు ముందు కూడా అక్కడ పలుమార్లు టీడీపీ గెలిచింది. దాంతో ఇక్కడ వైసీపీ జెండా పాతాలనుకుంటోంది. మరి ఫలితం ఎలా ఉంటుందో రెండు రోజుల్లో తేలనుంది.
ఇక మరో కీలకమైన వార్డు 61. ఇది స్టీల్ ప్లాంట్ పరిధిలో ఉంది. ప్లాంట్ ఉద్యమం గట్టిగా సాగుతోంది. అప్పట్లో స్టీల్ ఉద్యమం వల్లనే ఈ ప్రాంతాలలో టీడీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఇపుడు అది మరింత ఎక్కువగా ఉందని అంటున్నారు. దాంతో ఉప ఎన్నిక మీద ప్రభావం ఏ మేరకు ఉంది అన్నది చూడాలి.
ఇక చూస్తే 31వ వార్డులో టీడీపీ వైసీపీల మధ్య పోరు ఉంటే 61వ వార్డులో వైసీపీతో జనసేన పోటీ చేస్తోంది. దానికి టీడీపీ మద్దతు ఇస్తోంది అంటున్నారు. మొత్తానికి ఈ రెండు వార్డులు వైసీపీ ప్రస్తుతం బలం ఏంటో, సిటీలో రాజకీయం ఏ తీరున సాగుతుందో చెప్పనున్నాయి. మరి రిజల్ట్ కోసం 17 దాకా వెయిట్ చేయాల్సిందే.