కుక్కకు తోకలో విశ్వాసం ఎక్కువ వుంటుంది. పాముకు తోకలో పౌరుషం ఎక్కువ వుంటుంది. నక్క తోక అందంగా వుంటుంది. ఎన్ని సరుకులు డబ్బులిచ్చి కొన్నా చివర్న ఇచ్చే కొసరు లేదా ఫ్రీ సరుకు అంటే భలే ముచ్చటగా వుంటుంది. రాజకీయాలు కూడా ఇలాంటివే.
రాజకీయాల్లో, అధికార పదవుల్లో వున్నవారి కన్నా వారి బంధు గణం, వారి అనుచర గణం ఎక్కువగా తప్పులు చేస్తుంటారు. తమంతవారు లేరన్నంతగా కిందా మీదా అయిపోతుంటారు. కానీ దాని పలితాన్ని మాత్రం రాజకీయ, అధికార పదవుల్లో వున్నవారు అనుభవించాల్సి వస్తూ వుంటుంది.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో తెరాసకు కాస్తో, కూస్తో వ్యతిరేకత కనిపిస్తూందీ అంటే దానికి ఈ కొసరు జనాలు కూడా కొంత వరకు కారణం. కేటిఆర్ తో చెప్పమంటారా? కేసిఆర్ తో మాట్లాడాలా? అనే టైపులో జనాల్ని అదలించడం, బెదిరించడం వంటి వ్యవహారాలు చాటు మాటుగా గడచిన కొన్నేళ్లు గా జరుగుతూనే వున్నాయి.
నిజానికి వీరికి కేసిఆర్ దగ్గర, కేటిఆర్ దగ్గర మాట పలుకుబడి ఎంత వరకు వుందనేది ఎవరికి తెలియదు. కానీ లేస్తే మనిషిని కాదన్న టైపులో ఈ బెదిరింపుల హవా సాగుతోంది. ఈ విషయం కేసిఆర్ కు, కేటిఆర్ కు తెలియకపోవచ్చు. అసలు వారి వరకు వెళ్లి వుండకపోవచ్చు.
కానీ ఈ అదలింపులు, హుంకరింపులు కలిసి జనాల్లో కాస్తయినా నెగిటివిటీని పెంచాయి. అదే సమయంలో రాజకీయాల్లో కావచ్చు వృత్తి వ్యాపారాల్లో కావచ్చు జెలసీ అనేది ఒకటి వుంటుంది. మనతో ప్రయాణం స్టార్ఠ్ చేసినవాడు మన కన్నా ముందుకు దూసుకుపోతుంటే ఎక్కడో మండిపోతూ వుంటుంది అదే జలసీ. తెలంగాణ ఉద్యమం కోసం ఎందరో తలో చేయి వేసారు. అడుగు అడుగు కదిపారు. కానీ అధికారం కేసిఆర్ కే అందింది. చాలా మందికి ఏదో పదవి దొరికింది.
కానీ అలా దొరకనివారూ వున్నారు. వారందరికీ ఇప్పుడు కేసిఆర్ అంటే జలసీ. అలాంటి జలసీ కొంత నెగిటివిటీ పెంచింది. అలాగే కేసిఆర్ హయాంలో అందిన అవకాశాలు ఆలంబనగా కొందరు బాగా ఎదిగి వుండొచ్చు. కొందరు ఎదిగి వుండకపోవచ్చు.
దీనికి కేసిఆర్ కు సంబంధం వుండదు. దొరికిన అవకాశాన్ని వాడుకునే చాకచక్యం కొందరికి వుంటుంది. మరి కొందరికి వుండదు. ఈ చాకచక్యం ఉండని వారంతా తమ వైఫల్యాన్ని ఒప్పుకోరు. వాళ్లకు కేసిఆర్ ఏదో చేసాడు. తమకు చేయలేదు అనుకుంటారు. అదిగో అప్పుడు స్టార్ట్ అవుతుంది అసంతృప్తి.
సినిమా ఇండస్ట్రీ కొందరి చేతుల్లోనే వుండి వుండొచ్చు. చంధ్రబాబు అయినా జగన్ అయినా కేసిఆర్ అయినా వీళ్లే చక్రం తిప్పుతారు. వీళ్లకే చాన్స్ వుంటుంది. బాబు జమానా పోయి కేసిఆర్ వచ్చాక అయినా పరిస్థితి మారుతుందని, 'ఆ నలుగురు' కాకుండా మిగిలిన వారికి అవకాశం వస్తుందని అనుకున్నారు. కానీ మళ్లీ పరిస్థితి షరా మామూలే. దాంతో నిరాశ. ఆ నిరాశలోంచి పుట్టుకువచ్చిన అసంతృప్తి.
కొందరున్నారు. గత దశాబ్దాల కాలంగా తమ హవా సాగించారు. మీడియాను అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా బ్రేక్ వేయలేకపోయారు. అలిమిని బలిమి కొడితే బలిమిని బ్రహ్మదేవుడు కొడతాడు అన్నట్లు, ఎందరినో వీరు కొడితే, వీళ్లను కేసిఆర్ కొట్టినట్లు అయింది. దాంతో సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి.
కొందరు హైదరాబాద్ వదిలిపోయారు. కొందరు ఇళ్లకే పరిమితం అయిపోయారు. వీళ్లందరికీ ఒకటే ఆశ, కేసిఆర్ కు చిన్న ఎదురుదెబ్బ తగలబోతుందా? మళ్లీ తమ హవా రాకపోతుందా? అని. ఆ ఆశలోంచి పుట్టుకువచ్చిన వ్యతిరేకత.
ఇలా చినుకు చినుకు కలిసి వానై, వాగై, వరదైనట్లు వుంటుంది జిహెచ్ఎంసి ఎన్నికల వ్యవహారం.ఇలా ఒక్కో సెక్షన్ కు ఒక్కో విధమైన అసంతృప్తి. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో గడబిడ చేస్తోంది. అయితే ఇక్కడ డిసైడ్ ఫ్యాకర్ వీరెవరు కాదు. వీళ్లదంతా హడావుడే.
అసలు నిర్ణయించాల్సింది బస్తీల జనం. వారు ఎటు వుంటే అటు విజయం. వారు ఎటు వున్నారు అన్నది మరో నాలుగైదు రోజుల్లో తేలిపోతుంది. ఏ తేడా లేకుంటే ఈ తోకలు ఊపడాలు ఇలాగే వుంటాయి. అసంతృప్తులు అలాగే వుంటాయి. మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు.
ఆర్వీ