అమరావతి రాద్ధాంతం ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న వేళ మేధావులు కొత్త సూచనలు చేస్తున్నారు. అమరావతి రాజధాని ఎక్కడికో తరలిపోతోందని తలపండిన రాజకీయ నాయకులు కూడా చెబుతూ రచ్చ చేస్తున్నారని వారు అంటున్నారు. నిజానికి అమరావతి రాజధాని ఎక్కడికీ పోలేదని అది విస్తరించబడిందని అంతా గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.
అమరావతి 2 గా విశాఖపట్నాన్ని, 3 గా కర్నూలుని భావించాలని కూడా సలహా ఇస్తున్నారు. వైసీపీ సర్కార్ చెప్పినట్లుగానే అమరావతిలో అభివ్రుధ్ధి యధాప్రకారం సాగుతుందని, అలాగే విశాఖ, కర్నూలు వంటి వెనకబడిన ప్రాంతాలకు కూడా మూడు రాజధానుల వల్ల మేలు జరుగుతుందని అంటున్నారు.
ఇదిలా ఉండగా అమరావతి విషయంలో రాద్ధ్ధాంతం చేస్తున్న రాజకీయ పార్టీలు ఒక విషయం అర్ధం చేసుకోవాలని, వెనకబడిన ప్రాంతాలకు తగిన న్యాయం ఇప్పటికైనా జరగకపోతే అది పెరిగి పెద్దదవుతుందని అంతా గుర్తించాలని మేధావులు అంటున్నారు.
విశాఖ రాజధాని వల్ల ఉత్తరాంధ్రా ప్రాంతాలు అభివ్రుధ్ధి సాధిస్తాయని ముఖ్యమంతి జగన్ ఇక్కడకు రావడం వల్ల అభివ్రుధ్ధి పరుగులు పెడుతుందని కూడా ప్రొఫెసర్ కేఎస్ చలం, మాజీ వీసీ బాలమోహన్ దాస్, ఆర్ధిక నిపుణులు కేసీ రెడ్డి వంటి వారు అంటున్నారు.
ఏపీ భవిష్యత్తు తరాలను ద్రుష్టిలో ఉంచుకుని దీర్ఘకాల ప్రయోజనాలను మధింపు చేసుకుని ఏపీలోని అన్ని రాజకీయ పక్షాలు మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని మేధావులు కోరుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలలు ఉమ్మడి ఏపీలో తీరని అన్యాయం జరిగిందని వారు అంటున్నారు.
భాషాప్రయుక్త రాష్ట్రాల వల్ల ఒడిషాలోకి ఉత్తరాంధ్రా జీవనదులన్నీ వెళ్ళిపోయి సాగు, తాగు నీరు లేక ఈ ప్రాంతాలు గడచిన కొన్ని దశాబ్దాలుగా నానా ఇబ్బందులు పడుతున్న సంగతి రాజకీయ నాయకులు గమనించాలని కూడా సూచిస్తున్నారు. మొత్తం మీద అభివ్రుధ్ధి అన్నది అందరూ పంచుకోవాలన్నదే మూడు రాజధానుల వెనక మూల సూత్రమని, దాన్ని అర్ధం చేసుకుంటే రాధ్ధాంతాలు ఉండవని కూడా మేధావులు చెబుతున్నారు.