దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల జాతకం ఎలా ఉందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఎందుకంటే వాటి మెడ మీద ప్రైవేట్ కత్తి వేలాడుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇపుడు బలి పీఠం మీద నిలిచి ఉంది. ఆ తరువాత ఏంటి అన్నది కూడా ఆందోళన కలిగిస్తున్న విషయం.
ఈ నేపధ్యంలో విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర పోర్టుల మంత్రి శాంతన్ ఠాకూర్ ఒక చల్లని మాట చెప్పారనుకోవాలి. అది కూడా టెంపరరీగా మాత్రమే ఊరటను ఇచ్చే విషయంగా చూడాలి. ఆయన ఏమన్నారంటే దేశంలోని మేజర్ పోర్టులను ప్రస్తుతానికి ప్రైవేటీకరించమని. ఈ విషయంలో కేంద్రం ఇప్పటికైతే ఇదే నిర్ణయం మీద ఉందని కూడా అంటున్నారు.
అదే సమయంలో పీపీపీ విధానం అంటే ప్రభుత్వ ప్రైవేట్ పార్టిసిపేషన్ విధానం అమలవుతుంది అంటున్నారు. ఇక పోర్టులలో బెర్తులను డిమాండ్ ని బట్టి లీజులకు ఇచ్చే పరిస్థితి కూడా ఉందని చెబుతున్నారు. మొత్తానికి పోర్టులు ఈ రోజుకు బతికిపోయాయన్న మాట. అయితే ప్రైవేటీకరణ అన్నది కేంద్రం పాలసీగా ఉందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
అందువల్ల పోర్టుల విషయంలో కూడా ఈ రోజు నుంచి పోరాడి తీరవలసిందే అని కార్మిక సంఘాలు అంటున్నాయి. మొత్తానికి పోర్టులకు పూర్తి స్థాయి ఊపిరి లేదని, ప్రస్తునానికి వేటుకు కామా మాత్రమే పడిందని వారు ఆరోపిస్తున్నారు. మరి విశాఖ సహా అనేక మేజర్ పోర్టుల భవితవ్యం అగమ్యగోచరంగానే ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే అర్ధముందిగా.