తాము అధికారంలోకి రాగానే ఏం చేయబోయే అంశం గురించి అప్పుడే ప్రకటించేశారు తెలుగుదేశం ఏపీ విభాగం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్ ప్రభుత్వ హయాంలో చేపడుతున్న 'నాడూ -నేడూ' ప్రోగ్రామ్ గురించి విచారణ చేయిస్తారట అచ్చెన్నాయుడు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే.. అందుకు సంబంధించిన విచారణ చేపట్టడమే తమ ప్లాన్ అని అచ్చెన్న అప్పుడే ప్రకటించేశారు! మొత్తానికి చంద్రబాబు నాయుడే కాదు, తెలుగుదేశం పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు కూడా అప్పుడే రోజులు లెక్కబెడుతున్నట్టుగా ఉన్నారు.
ఐదారు శాతం ఓట్లు అటూ ఇటూ అయితే ఫలితం మారిపోతుందని చంద్రబాబు నాయుడు కడప జిల్లా టీడీపీ నేతల సమావేశంలో వ్యాఖ్యానించారు. మరి ఎవరి ఓట్లలో ఐదారు శాతం అటూ ఇటూ అవుతాయో చంద్రబాబు నాయుడు ఆలోచించుకుంటున్నట్టుగా లేరు. టీడీపీకి వచ్చిన 40 శాతం ఓట్లు ఆ పార్టీకే ఉంటాయనేందుకు చంద్రబాబు ఏం గ్యారెంటీ ఇస్తారో మరి!
అయినా.. ప్రతిపక్ష పార్టీగా ఇప్పటి వరకూ ఒక్క నిఖార్సైన కార్యక్రమం చేపట్టింది లేదు కానీ, అప్పుడే చంద్రబాబు నాయుడు ఓట్ల లెక్కలేయడం కామెడీగా ఉంది. ఏ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడో చెప్పే నంబర్లలా ఉన్నాయి చంద్రబాబు నాయుడి మాటలు.
ఆఖరికి ఆ స్థాయికి వెళ్లిపోయినట్టుగా ఉన్నారు చంద్రబాబు. ఆయనే అనుకుంటే అచ్చెన్నాయుడు అధికారంలోకి రాగానే విచారణ అంటూ ఉన్నారు.అయినా ముందుగా తేలాల్సిన విచారణలు వేరే ఉన్నాయి. అందులో ఒకటి ఈఎస్ఐ స్కామ్.
వందల కోట్ల రూపాయల విలువైన ఈ స్కామ్ లో అచ్చెన్నాయుడు ఆల్రెడీ జైలుకు వెళ్లొచ్చారు. అయితే చట్టం దయతో.. మళ్లీ బయటకు వచ్చారు. ఆ వ్యవహారంపై ఇంకా విచారణ జరుగుతూ ఉంది. అందులో తాడో పేడో అచ్చెన్నే తేల్చుకోవాలి. స్వయంగా తను విచారణను ఎదుర్కొంటూ, తాము అధికారంలోకి వచ్చేస్తే విచారణలు ఉంటాయని అచ్చెన్న చెప్పుకోవడం సిసలైన కామెడీ.
ఒకవైపు ఎన్నికలు వచ్చేస్తూ ఉన్నాయని భ్రమలు కలిగించడం, మరోవైపు అధికారం అందేసుకుంటున్నట్టుగా చెప్పుకోవడం.. బహుశా ప్రతిపక్షం పని ఇదే అని టీడీపీ నాయకులు అనుకుంటున్నట్టుగా ఉన్నారు. ఈ పగటి కలలతో అధికారం అందేస్తుందా?