వైఎస్ జగన్ పాలనలో అదృష్టజాతకురాలు ఎవరైనా ఉన్నారంటే…ఆమె మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకురాలిగా ఉంటూ కూడా కంటి చూపుతో ఆమె రాజకీయాలను శాసిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం చెలాయిస్తున్నా….కర్నూల్ జిల్లాలో మాత్రం భూమా అఖిలప్రియ పెత్తనమే సాగుతోందనే అభిప్రాయం లేకపోలేదు. కర్నూల్ జిల్లా రాజకీయాల్లో మొదటి నుంచీ భూమా కుటుంబ ఆధిపత్యం వుంటోంది. ఇప్పుడు ఆ వారసత్వాన్ని అఖిలప్రియ కొనసాగిస్తున్నారు.
టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిపై హత్యా యత్నం కేసే ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా కర్నూల్ వైసీపీ నాయకులు చెబుతున్నారు. తాజాగా కడప ఎస్పీ అన్బురాజన్‌ను ఏవీ సుబ్బారెడ్డి, ఆయన తనయ జస్వంతి కలిసి వినతిపత్రం సమర్పిం చారు. తనను హత్య చేసేందుకు కుట్ర పన్నిన భూమా అఖిలప్రియను వెంటనే అరెస్ట్ చేయాలని ఎస్సీకి ఏవీ విన్నవించాడు. అనంతరం ఆయన ఏవీ సుబ్బారెడ్డి మీడియా మాట్లాడుతూ కొన్ని కీలక ప్రశ్నలు తెర మీదకి తెచ్చాడు.
‘ నాపై హత్యా యత్నం కేసులో ఏ1 నుంచి ఏ6 వరకు నిందితులున్నారు. వీరిలో ఏ4, ఏ5 మినహీ మిగిలిన నిందితులను అరెస్ట్ చేశారు. ఏ4 అయిన భూమా అఖిల ప్రియను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదు. నన్ను హత్య చేసేందుకు భూమా కుటుంబం సఫారీ ఇచ్చిన మాట వాస్తవం కాదా’ అని ఆయన ప్రశ్నించారు. ఇదే కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ ఏ5 నిందితుడిగా ఉన్నాడు. కానీ ఏవీ సుబ్బారెడ్డి ప్రధానంగా అఖిలప్రియను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాడు.
ఏవీ మాట్లాడుతూ ఇప్పటికే పోలీసులు మూడు నోటీసులు ఇచ్చినా అఖిల ప్రియ, ఆమె భర్త నుంచి ఎలాంటి స్పందన లేద న్నాడు. ముందస్తు బెయిల్ వస్తే వాళ్ళు పోలీసులకు పలికే పరిస్థితి లేదని ఏవీ ఆవేదన వ్యక్తం చేశాడు. మళ్లీ తనపై దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతి మాట్లాడుతూ అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌ను వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కేసు విషయమై కడప పోలీసుల వాదన మరో రకంగా ఉంది. అసలు ఏవీ సుబ్బారెడ్డి నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకుండానే ఆయనపై హత్యాయత్నం కేసును ఛేదించామంటున్నారు. మార్చి మూడో వారంలో కేసు నమోదైనట్టు చెబుతున్నారు. విచారణ కు రావాలని భూమా అఖిలప్రియ, ఆమె భర్తకు మూడు నోటీసులు పంపామని చెబుతున్నారు. అయితే ఉన్నతస్థాయిలో ఏం జరుగుతున్నదో తమకు తెలియదని, భూమా అఖిలప్రియ నుంచి వివరణ వస్తే తప్ప తాము ముందడుగు వేయలేమని పోలీ సులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు, లోకేశ్ సహా చాలా మంది రాష్ట్ర నాయకులు ఆరోపి స్తున్నారు. ఒక్క కర్నూల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అఖిలప్రియ మాత్రం పోలీసులు, జగన్ సర్కార్‌పై ఎంతో నమ్మ కాన్ని వ్యక్తం చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు సక్రమ కేసులు పెట్టడానికే వెనుకా ముందూ ఆలోచిస్తుంటే, ఇక అక్రమ కేసులకు ఆస్కారం ఎక్కడ అని కర్నూల్ జిల్లా వైసీపీ నేతలు నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి అఖిలప్రియ మాత్రం తనను టచ్ చేసే దమ్ము, ధైర్యం జిల్లాలో ఎవరికీ లేవని మరోసారి రుజువు చేసుకున్నారు.