చినబాబుకి టీడీపీలో బాధ్యతలు అప్పగించారు. కేవలం ట్విట్టర్ కే పరిమితమై సోషల్ మీడియాలో ట్రోలింగ్ లో ట్రెండింగ్ లో ఉన్న లోకేష్ కి ఎట్టకేలకు పరామర్శల బాధ్యతలు దక్కాయి.
భవన నిర్మాణ కార్మికులు, టీడీపీ కార్యకర్తల కోసం ఉత్తుత్తి పరామర్శలకు వెళ్లే బాధ్యత ఇక లోకేష్ దే. కొన్ని రోజులుగా లోకేష్ పర్యటనలు చూస్తే ఇది అర్థమవుతుంది.
బాధిత కుటుంబాలను కలుసుకోవడం, ఓదార్చడం, జేజేలు కొట్టించుకోవడం, ఎంచక్కా తిరిగి వచ్చేయడం ఇదీ లోకేష్ దినచర్యగా మారింది.
ఎలాగూ దీక్షలకు, విమర్శలకు, నిర్మాణాత్మకమైన కార్యక్రమాలకు పనికిరాడు కాబట్టే పూర్తిగా వాటి విషయంలో లోకేష్ ని పక్కనపెట్టారు చంద్రబాబు.
ప్రెస్ మీట్లకు అసలేమాత్రం గిట్టుబాటు కాడు కాబట్టి చినబాబును మీడియా ముందుకు తీసుకు రావడంలేదు. అందుకే ఇలా పరామర్శల పని అప్పగించి, లోకేష్ కు ఉపాధి కల్పించారు చంద్రబాబు.
భవన నిర్మాణంతో సంబంధం ఉన్న వారి సహజ మరణాలన్నిటినీ ఆకలి చావులుగా చిత్రీకరిస్తోంది టీడీపీ. కుటుంబ కలహాలు, వ్యక్తిగత కక్షలతో జరిగిన దాడులకు కూడా రాజకీయాలు ఆపాదిస్తోంది.
ఇలా రాష్ట్రంలో ఏ మూల ఏ చిన్న క్రైమ్ జరిగినా దానికి కారణం వైసీపీయేనంటూ సొంత మీడియాలో కథనాలు వండి వారుస్తూ, ఆ తర్వాతి రోజు చినబాబుని పరామర్శలకు వదుల్తోంది.
కనీసం ఈ పరామర్శల ద్వారా అయినా లోకేష్, ప్రజలకు కాస్త దగ్గరైతే బాగుంటుందని చంద్రబాబు భావిస్తున్నారు.
మరి లోకేష్ ఈసారైనా నాన్నారి అంచనాలకు తగ్గట్టు రాణిస్తారా..? లేక ఎప్పట్లానే ఓ 3 రోజుల్లో పనికానిచ్చేసి మళ్లీ ట్విట్టర్ గూటికి చేరుకుంటారో చూడాలి.