సాధారణంగా సాయంత్రం వేళల్లో పురాణ కాలక్షేపాలు జరుగుతుంటాయి. వాటికి ఎవరు హాజరు అవుతారు? ఎవరో ఒక పెద్దాయిన చెప్పే పురాణ విషయాలపై అభిరుచి వున్నవారు, వాటి మీద ఆసక్తి వున్నవారు మాత్రమే వస్తారు. వాటి మీద ఆసక్తి, అనురక్తి వున్నవారు అటు వెళ్లమన్నా వెళ్లరు.
కానీ పురాణ కాలక్షేపాల పరమార్థం కేవలం వాటి మీద అభిరుచి వున్నవారికే కాదు. అభిరుచి లేని వారికి కూడా అర్థం అయ్యేలా చెప్పి, వారిని కూడా తన వైపు ఆకర్షించేలా చేసుకోగలగడం పురాణకాలక్షేపం చేసే వారి టాలెంట్ మీద ఆధారపడి వుంటుంది. అలా చేయకుండా పాడిందే పాడరా అంటూ చెప్పిందే చెబుతుంటే, ఆసక్తి కలిగి వచ్చేవారికి కూడా అనాసక్తిగా మారుతుంది.
ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైనం ఇలాగే మారుతోంది. ఆయన తరచు, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే నిత్యం జూమ్ లో పురాణ కాలక్షేపం చేస్తున్నారు. ఇందులో ఆయన చేసేది ఏమిటి? ఆంధ్ర సిఎమ్ జగన్ ను తిట్టిపోయడం.
అలా అని ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం కాదు. కేవలం జగన్ ను తిట్టిపోయడం. ఇంతకీ ఈ తిట్ల పురాణ కాలక్షేపానికి హాజరయ్యేవారు ఎవరు? పార్టీ నాయకులు. కీలక బాధ్యులు. వీరి ముందు నిత్యం జగన్ ను తిట్టి ప్రయోజనం ఏమిటి? వారికి జగన్ అంటే ప్రేమ ఏమైనా వుందా? ఈ తిట్ల దండకం దాన్ని పోగొడుతుంది అని అనుకోవడానికి.
ఈ కాలక్షేపానికి వచ్చేవారంతా తెలుగుదేశం జనాలే. వారికి ఈ తిట్లు కొత్త కాదు. విమర్శలు కొత్త కాదు. పోనీ అలా అని వారు ఈ తిట్లు, విమర్శలు తీసుకెళ్లి కార్యకర్తలకు వినిపిస్తారా? అంత సీన్ లేదు.
పార్టీలో వున్నారు కాబట్టి, బాబుగారి గుడ్ లుక్స్ లో వుండడం కోసం జూన్ మీటింగ్ కు హాజరు కాక తప్పదు. అంతకు మించి వారు చేసేది లేదు. చేయగలిగిందీ లేదు.
ఇక ఈ పురాణ కాలక్షేపం ఎవరికి పనికి వస్తుంది అంటే బాబుగారి అను'కుల' మీడియాకు. నిత్యం తెల్లవారుతూనే జనాలకు తమ పత్రిక పతాక శీర్షికలో జగన్ ను తిట్టడానికి ఏదో ఒక పాయింట్ లేదా స్టేట్ మెంట్ కావాలి. అది రోజూ బాబుగారు అందిస్తుంటారు.
అయితే ఈ మధ్య బాబుగారి పురాణ కాలక్షేపం కూడా కాస్త బోర్ కొడుతూందని, కొత్త పాయింట్లు కరువయ్యాయని ఆ మీడియాకు కూడా అర్థం అవుతోంది. అందుకే ఈ తిట్ల పురాణ సారాంశాన్ని లోపల పేజీల్లోకి మారుస్తున్నారు.
నిజానికి బాబుగారు చేయాల్సింది పార్టీ జనాలతో నిత్యం జూమ్ లో పురాణ కాలక్షేపం కాదు. జనాలకు వివరించాలి. తాను అనుకున్నది, లేదా తన విమర్శలు జనాల్లోకి వెళ్లేలా చేయాలి.
జనాలు అంటే తన పార్టీ జనాలు కాదు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే బాబుగారు పాయింట్ బేస్డ్ గా మాట్లాడడం మానేసారు. నేరుగా తన ఫ్రస్టేషన్ ను జగన్ పై తిట్లుగా మార్చడం మొదలుపెట్టారు. అందుకే ఇది జనాలను ప్రభావితం చేయడం కష్టం.
ఆ సంగతి ఆయనకూ తెలుసు. ఇప్పుడు జనాలు తను చెప్పింది వినే మూడ్ లో లేరని, అదే విధంగా జనం మూడ్ కు అనుగుణంగా తాను మాట్లాడే అవకాశం లేదా పాయింట్లు లేవు అని.
అందుకే నిత్యం జూమ్ లో తను భళా అంటే భళీ అనే పార్టీ జనాలకే తన తిట్ల పురాణకాలక్షేపాన్ని పరిమితం చేసారు. పదవి లేక, పని కరువైన వేళ చంద్రబాబుకు ఇదో కాలక్షేపం, అంతకు మించి దీనివల్ల ఒరిగేది లేదు..జరిగేది లేదు.
అందుకే ఈ జూమ్ సౌండ్ కు వైకాపా నుంచి కనీసపు రీసౌండ్ కూడా రాకుండా పోయింది.