ముఖ్యమంత్రి జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే పోలీసుల భద్రత లేకుండా రాజధాని ప్రాంతానికి రావాలని వారం క్రితం ప్రతిపక్ష నేత చంద్రబాబు సవాల్ విసిరాడు. మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే భయంతో జగన్ పోలీస్ వలయం మధ్య తిరుగుతున్నాడని బాబు అవహేళన చేసిన విషయం తెలిసిందే. రాజధాని రైతుల సంఘీభావ సభలో సీఎం జగన్‌కు బాబు సవాల్ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఇదే చంద్రబాబు ప్రజాచైతన్య యాత్రకు బయల్దేరుతో తనకు సరైన భద్రత కల్పించడం లేదని నానా యాగీ చేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రిని భద్రత లేకుండా తిరగాలని సవాల్ విసిరిన చంద్రబాబు…తాజాగా తన దగ్గరికి వచ్చేసరికి తనకంత మంది కావాలి, ఇంత మంది పోలీసుల రక్షణ కావాలని డిమాండ్ చేయడం ఏంటి?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నక్సలైట్ల నుంచి ముప్పు పొంచి ఉందని, కేంద్రం జెడ్ ప్లస్ కేటగిరి రక్షణ కల్పించిందని, దాని ప్రకారం 160 మంది సిబ్బంది భద్రతగా ఉండేవారని టీడీపీ లెక్కలు చెబుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక భద్రతకు సంబంధించి భారీ కోత విధించిందని టీడీపీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే 97 మందితో భద్రత కల్పిస్తున్నట్టు ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. కానీ 58 మందికి భద్రత తగ్గించినట్టు టీడీపీ ఆరోపిస్తోంది.
నిజానికి ఇటీవల కేంద్రప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న నేతల భద్రతపై సమీక్షించి రక్షణ సిబ్బంది సంఖ్యలో మార్పు చేయకుండా, ఫోర్స్‌లో మార్పు చేపట్టింది. ఇది ఒక్క చంద్రబాబుకే ప్రత్యేకంగా వర్తించలేదు. రాహుల్‌గాంధీ కుటుంబానికి కూడా భద్రతలో కేంద్రం మార్పు చేసింది. కానీ టీడీపీ మాత్రం బాబుకు రక్షణ సిబ్బందిని కుదించి వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపిస్తోంది.
టీడీపీ ఆరోపణలను డీజీపీ ఖండించారు. చంద్రబాబు భద్రతలో ఎలాంటి మార్పులు జరగలేదంటూ ఏపీ డీజీపీ కార్యాలయం వివరణ ఇచ్చింది. దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీని చంద్రబాబుకు కల్పిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం జడ్‌ప్లస్ సెక్యూరిటీతో చంద్రబాబుకు భద్రతను కల్పిస్తున్నామని వెల్లడించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు, చేర్పులు చేశామని వివరించింది. చంద్రబాబుకు మొత్తం 183 మందితో భద్రత కల్పిస్తున్నామని వివరించింది. విజయవాడలో 135 మందితో, హైదరాబాద్‌లో 48 మందితో చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్నామని చెప్పింది.
అయినా ముఖ్యమంత్రిని మాత్రం భద్రత లేకుండా తిరగాలని డిమాండ్ చేసిన చంద్రబాబు, ఆయన అనుచరులు….తమ దగ్గరికి వస్తే మాత్రం శివాలెత్తినట్టు రెచ్చిపోవడంపై విమర్శలు చెలరేగాయి. చంద్రబాబుకు వచ్చిన ముప్పేంటని ప్రశ్నిస్తున్నారు. 14 ఏళ్లపాటు సీఎంగా పనిచేసిన వ్యక్తి….మరో సీఎం భద్రతపై అవాకులు చెవాకులు మాట్లాడేటప్పుడు విచక్షణ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. జనాన్ని చైతన్యపరచడానికి వెళుతున్నానని చెప్పుకుంటున్న చంద్రబాబు…ఎందుకు అంతగా భయపడుతున్నారో అర్థం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. జనంలోకి వెళ్లేందుకు కూడా ఆయనకు దమ్ము, ధైర్యం లేవా అని ప్రశ్నిస్తున్నారు.