జగన్ పై చంద్రబాబు చేస్తున్న విమర్శలు తిరిగి ఆయనకే రివర్స్ లో తగులుతున్నాయి. జగన్ వైపు ఒకవేలు చూపిస్తే.. నాలుగు వేళ్లు బాబునే వెక్కిరిస్తున్నాయి. బాబు చేస్తున్న విమర్శలన్నీ తన తప్పిదాల్ని తానే అంగీకరిస్తున్నట్టు చెబుతున్నాయి. వైసీపీ వల్ల రాష్ట్రం నాశనమైపోతోంది అంటూ తెగ ఇదైపోతున్నారు చంద్రబాబు.
వైసీపీ విధానాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు ఆగిపోయాయని, కంపెనీలు రావట్లేదని మొసలికన్నీరు కారుస్తున్నారు. టీడీపీ హయాంలోని ఐదేళ్లకాలంలో కంపెనీలన్నీ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టి ఉంటే.. ఇప్పుడిలా వైసీపీపై బురదజల్లాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఐదేళ్లలో రాని కంపెనీలు ఈ మూడు నెలల్లోనే వచ్చి తిరిగెళ్లిపోతున్నాయంటే నమ్మేదెలా? ఇది చంద్రబాబు తనకు తాను చేసుకున్న సెల్ఫ్ గోల్.
తమ ప్రభుత్వం కేటాయించిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందనేది మరో ఆరోపణ. అసలు ఐదేళ్లలో బాబు హయాంలో ఎంతమందికి ఇళ్లు కట్టించి చేతికి అందించారు. గృహప్రవేశేల పేరుతో నాటకాలు ఆడారు, కొన్నిచోట్ల బ్యాంకు క్లియరెన్స్ లు కూడా రాలేదు, మరికొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తికాలేదు. అంతా సగం సగం పనులు చేసి ఇప్పుడు ఇళ్లు రద్దు చేస్తున్నారనడం దేనికి. ఐదేళ్లలో ఇళ్లు కట్టించి లబ్ధిదారులకు అందిస్తే.. జగన్ వచ్చి వాటిని ఖాళీ చేయించలేరు కదా. సగం సగం పనులు చేసి, ఇప్పుడు జగన్ వైపు వేలెత్తి చూపిస్తే.. ఐదేళ్లలో బాబు ఏం చేశారా అనే ప్రశ్న తెరపైకి వస్తుంది.
ఇక పోలవరం ప్రాజెక్ట్ పై చేస్తున్న ఆరోపణలు కూడా చంద్రబాబు తెలివి తక్కువ తనానికి పరాకాష్టగా మారాయి. జగన్ పోలవరాన్ని అడ్డుకుంటున్నారని, ఆపేస్తున్నారని కథనాలు అల్లుతున్నారు. అసలు ఐదేళ్లలో చంద్రబాబు ఆ ప్రాజెక్ట్ ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు. అన్ని అనుమతులు ఉన్నా.. కేంద్రంతో సఖ్యత ఉన్న రోజుల్లో కూడా పనులు ఎందుకు ముందుకు కదల్లేదు. కమీషన్ల కక్కుర్తితో నత్త నడకన పనులు చేసి ఇప్పుడు పోలవరం ఆగిపోయింది అంటే ఎలా నమ్మాలి.
జగన్ పై నింద వేస్తున్న బాబు, తాను అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పూర్తిచేసి ఉంటే.. ఈ బాధలు ఉండేవికాదు కదా. అంటే ఇక్కడ కూడా బాబు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక అమరావతి. భ్రమరావతిలో ఏముందని జగన్ దాన్ని తరలించి వేస్తారు. వరదలొస్తే మునిగిపోయే చోట రాజధాని ఎందుకనే చర్చ మొదలైతే.. అసలు రాజధానినే మార్చేస్తున్నారంటూ బుకాయిస్తోంది పచ్చ బ్యాచ్. నిజంగా చంద్రబాబు రాజధాని పూర్తిచేసి ఉంటే.. కనీసం సగం పనులైనా పూర్తై ఉంటే జగన్ కి ఈ అవకాశం ఉండేది కాదు కదా.
తన హయాంలో అమరావతి పేకమేడలు కట్టి.. జగన్ వచ్చీ రాగానే అవి కూలిపోతున్నాయంటే నమ్మేందుకు జనం వెర్రివాళ్లు కాదు కదా బాబు. ఐదేళ్లలో తన వైఫల్యం అంతా ఇప్పుడు బైటపడుతోందనే అక్కసుతోనే చంద్రబాబు జగన్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలన్నీ పరోక్షంగా చంద్రబాబు అసమర్థతనే బైటపెడుతున్నాయి. తన తప్పుల్ని తానే ఒప్పుకుంటున్న బాబు ఇక లెంపలు వేసుకోవడం ఒక్కటే మిగిలుంది.