“అమరావతినుంచి రాజధాని తరలిస్తారా..? ప్రజలారా చూస్తూ ఊరుకుంటారా. నా కంట్లో నీళ్లు తిరిగాయి, మీరేంచేస్తారు, రెచ్చిపోండి, నిరసనలకు సిద్ధం కండి..” ఇదీ చంద్రబాబు ప్రసంగ సారాంశం. రాష్ట్ర విభజన తర్వాత ప్రజలు కాంగ్రెస్ కి సమాధి కట్టారని, అలాగే రాజధాని విభజన తర్వాత ప్రజలు వైసీపీకి బుద్ధి చెబుతారంటూ శాపనార్థాలు పెట్టారు.
మూడు రాజధానులకు గవర్నర్ ఆమోద ముద్ర పడిన తర్వాత చంద్రబాబుకి ఏంచేయాలో అర్థం కాలేదు. బీజేపీ అడ్డుకుంటుదన్న ఆశ లేదు. ఇంత త్వరగా వ్యవహారం తేలిపోతుందని ఊహించలేదు. అందుకే మరోసారి నాలుక మడతపెట్టారు. ఇన్నాళ్లూ అమరావతి రైతులకు నేనున్నానంటూ కబుర్లు చెప్పిన బాబు.. ఇప్పుడు తన చేతిలో ఏం లేదు, రెచ్చిపోండంటూ రెచ్చగొడుతున్నారు.
అంతేకాదు.. ఈ సందర్భంగా తొలిసారి వేదాంత ధోరణిలో మాట్లాడారు బాబు. మహా అయితే, ఆరోగ్యం సహకరిస్తే తానింకా 10ఏళ్లు బతికుంటానని, తన బాధంతా భావితరాలు, అమరావతి గురించేనని మొసలి కన్నీరు కార్చారు.
రాజధాని వ్యవహారంలో అమరావతిలో కొంతమంది మాత్రమే నిరసనలకు దిగారు. వారు కూడా టీడీపీ ప్రభావం నుంచి బైటపడలేనివారు, ఇంకొందరు పెయిడ్ బ్యాచ్. మిగతా ప్రాంతాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రజలు పండగ చేసుకున్నారు. రాజధానిలో తమకూ భాగముందని సంతోషించారు. సంతోషంలో ఉన్న ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఎందుకు నిరసన తెలియజేయాలి?
కానీ చంద్రబాబు మాత్రం “ఎంతసేపు నేనేనా రాష్ట్రం గురించి ఆలోచించేది, ప్రజలకు కూడా బాధ్యత ఉంది. మీరంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేయాలం”టూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ విద్వేష ప్రసంగానికి తోడు.. అనుకూల మీడియా కూడా రెచ్చిపోయింది. భగ్గుమన్న అమరావతి అంటూ మరింత సెగ రాజేసే ప్రయత్నాలు చేసింది.
ఈ నాటకానికి ఫినిషింగ్ టచ్ ఏంటంటే.. అసెంబ్లీని రద్దు చేసి జగన్ మరోసారి ఎన్నికలకు వెళ్లాలట. రాజధాని వ్యవహారాన్ని రెఫరెండం పెట్టాలట. ఈ మాట చాలదా చంద్రబాబు అధికారదాహంతోనే ఇవన్నీ చేస్తున్నారని చెప్పడానికి. ఆయన ప్రేమ అమరావతిపై కాదు, రైతులపై అంతకంటే కాదు, అది అధికార దాహం తప్ప ఇంకేమీ కాదు.
అమరావతి అనేది బాబుకు ఓ రాజకీయ పావు మాత్రమే. ఆ ప్రాంత ప్రజలు ఈ విషయాన్ని ఇప్పటికే గ్రహించారు. అందుకే బాబు పిలుపును లైట్ తీసుకున్నారు.