ఇందుగలడందులేడని సందేహము వలదు.. అన్నట్టుందట చంద్రబాబు అండ్ టీమ్ నిర్వాకం. ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ దిక్కుతోచని స్థితిలో ఏర్పడ్డ విషయం అందరికీ తెల్సిందే. సంక్షోభంలోంచి అవకాశాల్ని వెతుక్కోవడం తనకు బాగా తెలుసని పదే పదే చెబుతుంటారు. నిజమే, చంద్రబాబు చాలా అవకాశాలు ఎదుర్కొన్నారు. పదేళ్ళుపాటు ప్రతిపక్షంలో వున్న చంద్రబాబు, ముఖ్యమంత్రి హోదాని మేగ్జిమమ్ ఎంజాయ్ చేసేశారు.. గత ఐదేళ్ళలో.
రాజధాని అమరావతి కావొచ్చు, పోలవరం ప్రాజెక్టు కావొచ్చు.. ఇంకోటి కావొచ్చు.. చంద్రబాబు చెప్పిన మాటలకీ, ఐదేళ్ళలో చేసిన పనులకీ పొంతనే లేదు. జిల్లాకి ఓ విమానాశ్రయం అన్నారు.. స్మార్ట్ సిటీలన్నారు.. మెగా సిటీలన్నారు. ఇవేవీ కన్పించలేదు సరికదా, ఆంధ్రప్రదేశ్ నెత్తిన కనీ వినీ ఎరుగని రీతిలో 'అప్పుల మూట' పెట్టేశారు.
మరోపక్క, ముఖ్యమంత్రి అవుతూనే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి సమస్యలు స్వాగతం పలికాయి. ఓ వైపు చంద్రబాబు పాలన కారణంగా తయారైన అప్పుల భారం, ఇంకోపక్క.. అభివృద్ధిలో మందగమనం.. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోక తప్పడంలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి.. ఇంకా నెల రోజులు కాలేదుగానీ, కుప్పలు తెప్పలుగా సంచలన నిర్ణయాలు మాత్రం వైఎస్ జగన్ తీసుకున్నారు.
ప్రజా వేదిక కూల్చివేత అనేది చాలా చిన్న విషయంగా చెప్పుకోవాలేమో. ఎందుకంటే, అంతకు మించిన అక్రమాలు కోకొల్లలుగా వున్నాయి. ఆ వ్యవహారాలన్నిటినీ వెలికి తీయాలంటే, వైఎస్ జగన్ ప్రభుత్వానికి ప్రజలిచ్చిన ఐదేళ్ళూ సరిపోకపోవచ్చు. ఇదే విషయమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అధికారులు వెల్లడిస్తున్న విషయాలతో ఒక్కోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ షాక్‌కి గురవుతున్నారట.
పరిస్థితి ఇంత తీవ్రంగా వుంటే, రాష్ట్రాన్ని నట్టేట్లో ముంచేసిన తెలుగుదేశం పార్టీ మాత్రం, 'దమ్ముంటే నిజాలు నిగ్గు తేల్చండి..' అంటూ నిస్సిగ్గుగా సవాల్ విసురుతోంది. అయితే, ప్రజా వేదిక కూల్చివేతతోనే దానికి అయ్యే ఖర్చెంతో, చేసిన ఖర్చెంతో జనానికి ఓ అవగాహన వచ్చేసిందనుకోండి.. అది వేరే విషయం. ప్రత్యేక విమానాల్లో జల్సా ప్రయాణాలు, విదేశీ పర్యటనలు, పెట్టుబడుల్ని రాబడ్తామంటూ నిర్వహించిన సమ్మిట్‌లు.. వీటన్నిటి వెనుక 'ఆమ్యామ్యా'ల వ్యవహారాలు వెలుగులోకి రావాలంటే, వచ్చే ఐదేళ్ళూ వైఎస్ జగన్ ప్రభుత్వానికి సరిపోతాయా.? కష్టమేనేమో.!