కరోనా కష్టకాలంలో ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారునికి రూ.10 వేలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సాధన దీక్షలో డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్న సాయం చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. కరోనా కాలంలో ప్రజలను ఆదుకోవాలనడంలో సందేహం లేదు. ఒక ప్రతిపక్షంగా ఇటువంటి డిమాండ్‌తో ఆందోళన చేపట్టడం అభినందనీయమే. అయితే….ఇందులో చిత్తశుద్ది ఎంతనేది ప్రశ్న.
జగన్ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో అమ్మఒడి రైతు బరోసా, చేయూత, ఆసరా, విద్యా దీవెన, వసతి దీవెన వంటి రకరకాల పథకాల పేరుతో దాదాపు లక్ష కోట్ల రూపాయల ప్రజల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. అంటే ఏడాదికి 50 వేల కోట్లు…నెలకు నాలుగు వేల కోట్లకుపైగా ప్రజల ఖాతాల్లోకి వేసింది.
వివిధ పథకాల పేరుతో జమయిన ఈ లక్ష కోట్ల రూపాయలు కరోనా కష్టకాలంలో పేదలను ఎంతగానో ఆదుకుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వం చదువుల కోసం వేసివుండొచ్చు, పంటల సాగుకోసం ఇచ్చివుండొచ్చు, స్వయం ఉపాధి కోసం జమ చేసివుండొచ్చు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో డబ్బులిచ్చినా అవి పేదల జీవనానికి ఉపయోగపడ్డాయనడంలో సందేహం లేదు. ఈ డబ్బులే లేకుంటే పేదలు విలవిల్లాడిపోయివుంటారు.
అయితే….ఇవేవీ పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ, తన అనుకూల మీడియా ‘అప్పులు తెచ్చి పబ్బు బెల్లాలు పంచినట్లు పంచుతున్నారంటూ' గగ్గోలు పెట్టాయి. నగదు బదిలీ పథకాల వల్ల అభివృద్ధి ఆగిపోయిందని నానా హైరానా చేశాయి.
జనం ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నప్పుడు రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని విమర్శించిన చంద్రబాబు….ఇప్పుడు కరోనా పేరుతో నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. ప్రభుత్వం తనంతటతానుగా నగదు ఇవ్వకూడదు..తాము చెప్పాకే ఇవ్వాలి…అప్పుడే ఆ క్రెడిట్ తమ పార్టీకి వస్తుందన్న భావన చంద్రబాబులో కనిపిస్తోంది.
తాము అధికారంలో ఉండగా…హద్‌హుద్ తుపాను, తిత్లీ తుపాను బాధితులను ఉదారంగా ఆదుకున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అందులో నిజమెంతో అప్పటి వార్తలను చూస్తే అర్థమవుతుంది. ఊరు మొత్తానికి పరిహారం కింద రూ.500 ఇచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అప్పట్లో విమర్శలు చేశారు. తుపాను బాధితులకు బియ్యం, ఉప్పు, పప్పు తప్ప అంతకంటే మించిన సాయం ఏమీలేదు. అవేవీ జనానికి గుర్తుండవులే అనే నమ్మకంతో బాబుగారు….అప్పటి సాయం గురించి బలంగా చెబుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారనేది వదిలేద్దాం….వంద సంవత్సరాల్లో కనీవినీ ఎరుగని ఉత్పాతం కరోనా రూపంలో వచ్చింది. ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీగా ప్రజలు ఏమి చేసిందనేది ప్రశ్న. ఈ రాష్ట్రంలో పెద్దగా బలం లేని సిపిఎం, సిపిఐ వంటి పార్టీలు కరోసా ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాయి. తమ పార్టీ ఆఫీసులనే కరోసా సహాయ కేంద్రాలుగా మార్చి బాధితులను ఆదుకున్నాయి. మరి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది?
చంద్రబాబు అనుకునివుంటే…కనీసం నియోజకవర్గానికి ఒక కరోనా కేంద్రాన్ని ఏర్పాటు చేసివుండొచ్చు. లక్షల మందికి సహాయం చేసివుండొచ్చు. కనీసం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ అటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు.
అటువంటిది చంద్రబాబు నాయుడు…కరోనా సాయం గురించి, కనికరం గురించి, దయ, జాలి గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తాను ఏమి చెప్పినా ప్రశ్నించకుండా….గంటల కొద్దీ చూపించే టీవీలు, పేజీల కొద్దీ ప్రచురించే పత్రికలు ఉన్నన్ని రోజులు బాబుగారు ఏమైనా మాట్లాడుకోవచ్చు. అయితే…ఆ మాటలను ప్రజలు ఎంత వరకు విశ్వసిస్తారనేదే ప్రశ్న.
– ఆదిమూలం శేఖర్, సీనియర్ జర్నలిస్ట్