ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. వరసగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలను అందుకున్నారు కేజ్రీవాల్. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి కేజ్రీవాల్ పాలనకు ఢిల్లీ ప్రజలు ఓటేసినట్టుగా అయ్యింది. ఇలా నేషనల్ క్యాపిటల్ కు మరోసారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు.
ఇక కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఒక బుడతడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బేబీ మఫ్లర్ మాన్ గా మీడియాలో ఆ పిల్లాడు హైలెట్ అవుతూ ఉన్నాడు. ఫలితాల వెల్లడి రోజునే ఆ పిల్లాడు మీడియాలో పతాక శీర్షికల్లో కనిపించాడు. అచ్చం అరవింద్ కేజ్రీవాల్ స్టైల్లో అతడి మేకప్ ఆకట్టుకుంది. క్యూట్ గా ముద్దొస్తున్న ఆ పిల్లాడు ఆప్ విజయోత్సవాల్లో హైలెట్ అయ్యాడు. అతడి తండ్రి ఆప్ కార్యకర్త. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్సవానికి ఆ పిల్లాడికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ క్రమంలో ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా తను హైలెట్ అయ్యాడు. ఈ బేబీ మఫ్లర్ మాన్ తో సెల్ఫీలు తీసుకోవడానికి అక్కడకు వచ్చిన వారు పోటీలు పడ్డారు.
ఇక ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలు తన కుటుంబ సభ్యులు అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ మేలు కోసం పాటుపడటమే తన లక్ష్యమని కేజ్రీ చెప్పారు. ఇక ఆప్ సపోర్టర్లు నాయక్ 2 పాలన సాగుతుందని అంటున్నారు. సౌత్ సినిమా ఒకే ఒక్కడకు హిందీ రీమేక్ నాయక్. అందులో వన్డే సీఎంగా అనిల్ కపూర్ పాలన సాగించినట్టుగా, అరవింద్ పాలిస్తారని.. ఇప్పటికే నాయక్ పార్ట్ వన్ పూర్తయ్యిందని, రాబోయే ఐదేళ్లూ నాయక్ పార్ట్ 2 పాలన సాగుతుందని వారు పోస్టర్లు ప్రదర్శించారు.