చంద్రబాబు కంటే బాలకృష్ణే బెటర్..?

ఏపీలో 641 జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ కేవలం ఆరు చోట్ల గెలిచింది. ఆరు జిల్లాల్లో ఆ పార్టీ ఒక్కో స్థానం గెలుచుకోగా.. అందులో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు లేకపోవడం విశేషం. జడ్పీ ఫలితాల్లో…

ఏపీలో 641 జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ కేవలం ఆరు చోట్ల గెలిచింది. ఆరు జిల్లాల్లో ఆ పార్టీ ఒక్కో స్థానం గెలుచుకోగా.. అందులో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు లేకపోవడం విశేషం. జడ్పీ ఫలితాల్లో చిత్తూరులో టీడీపీ స్కోరు జీరో. ఎంపీటీసీ ఫలితాల్లో నియోజకవర్గాల లెక్కలు తీస్తే బాబు స్కోరు 3 దగ్గరే ఆగిపోయింది. 

బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, ఏలూరు సాంబశివరావు, చింతమనేని ప్రభాకర్ వంటి వారంతా బాబుని మించిపోయారు. ఆయన కంటే ఎక్కువ సీట్లు గెలిపించుకున్నారు.

బాబు పరువు పాయే..

గతంలో టీడీపీ ఎప్పుడు ఓడిపోయినా ఇలాంటి పోలికలు బయటకు రాలేదు. కానీ ఈ దఫా మాత్రం కుప్పంలో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం హైలెట్ అయింది. కుప్పం మండలంలో వైసీపీ మహిళా యువనేత అశ్విని బాబుకి చుక్కలు చూపించడం విశేషం. ఆమె వయసు జస్ట్ 23 ఏళ్లే కావడం, టీడీపీకి 23 సెంటిమెంట్ బాగా పట్టుకుందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. 

ఆ విషయం పక్కనపెడితే.. ఇప్పుడు టీడీపీలోని మిగతా నేతలంతా బాబుకంటే బాగా బెటర్ అనే కంపేరిజన్ తెరపైకి వచ్చింది. మరీ ముఖ్యంగా బాబు కంటే బాలయ్యే బెటర్ అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. వైసీపీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియాలో ఇప్పుడిదే హాట్ టాపిక్.

కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గెలిపించుకున్న ఎంపీటీసీ అభ్యర్థులు ముగ్గురు. హిందూపురంలో బాలయ్య గెలిపించుకున్నవారు ఏడుగురున్నారు. ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా రెచ్చిపోతున్న అచ్చెన్నాయుడు కూడా 4 దగ్గరే ఆగిపోవడం విశేషం. 

టీడీపీలో ధూళిపాళ్ల నరేంద్ర స్కోరు అత్యథికంగా 12. ఆ తర్వాత 11 ఎంపీటీసీ స్థానాలతో నిమ్మల రామానాయుడు రెండో స్థానంలో ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన నియోజకవర్గం దెందులూరులో 10 ఎంపీటీసీ స్థానాలను గెలిపించుకోగలిగారు.

బాబు ముందు 2 ఆప్షన్లు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఫలితాలు పరోక్షంగా చంద్రబాబు మెడకు బాగా చుట్టుకున్నాయి. పార్టీలో ఆయనకంటే చాలామంది మంచి ఫలితాలు సాధిస్తే.. అధినేత మాత్రం మూడు ఎంపీటీసీ స్థానాలు గెలిపించుకోడానికే అష్టకష్టాలు పడ్డారని అర్థమవుతోంది. అంటే వచ్చే ఎన్నికలనాటికి అక్కడ టీడీపీకి మరింత గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశముంది. 

ఇప్పుడు బాబు ముందు రెండే రెండు ఆప్షన్లున్నాయి. హైదరాబాద్ వదిలేసి కుప్పంకి మకాం మార్చేయాలి, లేదా 2024 నాటికి వేరే నియోజకవర్గం అయినా వెదుక్కోవాలి.