బీజేపీ ఓట‌మిపై బండి పోస్టుమార్టం రిపోర్ట్‌

తెలంగాణ‌లో ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రెండు చోట్ల ఓట‌మితో బీజేపీ తీవ్ర అస‌హ‌నానికి గురి అవుతోంది. నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక ముందు ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎలాగైనా విజ‌యం సాధించి, అధికార పార్టీకి…

తెలంగాణ‌లో ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రెండు చోట్ల ఓట‌మితో బీజేపీ తీవ్ర అస‌హ‌నానికి గురి అవుతోంది. నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక ముందు ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎలాగైనా విజ‌యం సాధించి, అధికార పార్టీకి గ‌ట్టి ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని తెలంగాణ బీజేపీ విశ్వ ప్ర‌య‌త్నం చేసింది. అయితే హైద‌రాబాద్‌లో సిట్టింగ్ స్థానం కోల్పోవ‌డంతో పాటు న‌ల్గొండ‌లో నాలుగో స్థానానికి ప‌డిపోవ‌డం ఆ పార్టీ జీర్ణించుకోలేకుంది.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ రెండు చోట్లా ఓట‌మిపై త‌న‌దైన పోస్టుమార్టం చేశారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను బ‌య‌ట పెట్టారు. బీజేపీ ల‌క్ష్యంగా కొన్ని పార్టీలు ప‌నిచేశాయ‌ని మండిప‌డ్డారు. 

తెలంగాణ‌లో త‌న పార్టీకి పుట్ట‌గ‌తులుండ‌వ‌ని తెలుసుకున్న కేసీఆర్‌, తాను బ‌య‌ట‌కు రాకుండా వేరే పార్టీ నేత ముఖం పెట్టుకుని వ‌చ్చార‌ని మండిప‌డ్డారు.కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ పెరిగిందని ఆయ‌న చెప్పుకొచ్చారు. 70 శాతం మంది ఓటర్లు టీఆర్ఎస్‌ను వ్యతిరేకించారన్నారు. ఓట్లు చీలడంతో పాటు కోట్లు ఖర్చు పెట్టి టీఆర్ఎస్ గెలిచిందన్నారు. 

ఉద్యోగులను మానసికంగా ఇబ్బంది పెట్టారని బండి సంజయ్‌ మండిపడ్డారు. పట్టభద్రులు టీఆర్ఎస్‌ మీద ప్రేమతో ఓటు వేయలేదన్నారు. పీఆర్సీ ఇవ్వరని భయపడే టీఆర్ఎస్‌కు ఓటేశారని సంజ‌య్ అస‌లు కార‌ణాన్ని తేల్చి చెప్పారు.  పీఆర్సీ ఇవ్వకపోతే సీఎం కేసీఆర్‌ తలదించుకునేలా చేస్తామని ఆయ‌న హెచ్చ‌రించారు.