ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ను అరెస్టు చేసి కడపకు తరలించారు. కడపజిల్లాకు చెందిన మహేశ్ అనే వ్యక్తి వద్ద పదమూడు కోట్ల రూపాయల అప్పు తీసుకుని, తిరిగి చెల్లించని వ్యవహారంలో గణేష్ ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. తనకు గణేష్ అప్పు ఎగ్గొట్టాడని మహేశ్ అనే వ్యక్తి కొన్నాళ్ల కిందట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ విచారణకు కూడా గణేష్ హాజరు కానట్టుగా తెలుస్తోంది.
దీంతో కోర్టు ఆయనపై అరెస్టు వారెంట్ జారీచేసింది. అరెస్టు చేసి అతడిని హాజరు పరచాల్సిందిగా పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో గణేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో అతడిని అరెస్టు చేసి, వ్యక్తిగత వాహనంలోనే గణేష్ ను కడపకు తరలించారు పోలీసులు. అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
కడపజిల్లాలోని చాలామంది వ్యాపారుల వద్ద నుంచి గణేష్ భారీగా అప్పులు చేశాడని టాక్. ఒక్క ప్రొద్దుటూరులోనే గణేష్ బాధితులు చాలామంది ఉన్నారని, భారీఎత్తున వారికి గణేష్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వ్యవహారంలో గణేష్ అరెస్ట్ అయ్యాడు.