150 కోట్ల రూపాయల విలువైన ఈఎస్ఐ స్కామ్ తో జైలుకు వెళ్లిన అచ్చెన్నాయుడుతో, హత్య కేసులో అరెస్టైన కొల్లు రవీంద్రతో బీసీలకు సంబంధం లేదని ఆ కుల సంఘం ఒకటి ప్రకటించింది. వాళ్లేమీ బీసీల హక్కుల కోసం పోరాడుతూ జైళ్లకు వెళ్లలేదని, వాళ్లు వ్యక్తిగత వ్యవహారాలతో, అవినీతి ఆరోపణలతో జైళ్లకు వెళ్లారని..అలాంటి వారి ప్రయోజనాల కోసం బీసీ సంఘాల మద్దతు ఉండదని ఆ సంఘాలు చెబుతున్నాయి. ఈ మేరకు పత్రికా ప్రకటనలు విడుదల చేస్తున్నాయి సదరు సంఘాలు.
అచ్చెన్నాయుడు అరెస్టును బీసీలపై దాడి అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అభివర్ణించిన సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడు అరెస్టు కాగానే ఆ పాట మొదలుపెట్టారు. ఆ తర్వాత కొల్లు రవీంద్ర అరెస్టుతో మళ్లీ అదే పాటే అందుకున్నారు. అచ్చెన్నాయుడు అరెస్టు అయ్యింది ఏకంగా 150 కోట్ల రూపాయల స్కాములో. మాజీ మంత్రిగా ఆయన బాధ్యత వహించాల్సిన వ్యవహారం అది. ఇక ఒక మనిషి ప్రాణం తీయడానికి ప్రోత్సాహం ఇచ్చారు అని కొల్లు రవీంద్రపై ఫిర్యాదు నమోదు అయ్యింది.
గమనించాల్సిన అంశం ఏమిటంటే.. కొల్లు రవీంద్ర ప్రోత్సాహంతో జరిగిందంటున్న హత్యలో ప్రాణాలు కోల్పోయింది కూడా ఒక బీసీ వ్యక్తే. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన ఒక వ్యక్తి హత్య కేసులో కొల్లు రవీంద్రపై కేసు నమోదు అయ్యింది. హత్య చేసి వస్తే తను చూసుకుంటానంటూ ఆయన హామీ ఇచ్చారట. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు దొరక్కకుండా పారిపోయే ప్రయత్నం చేయడం కొల్లు రవీంద్ర చేసిన రెండో పొరపాటు, తప్పు చేయనప్పుడు ఎందుకు పారిపోయే ప్రయత్నం చేశారనే ప్రశ్న తలెత్తుతూ ఉంది. ఆయనను చేజ్ చేసి పోలీసులు పట్టుకోవాల్సి వచ్చింది.
ఈ క్రమంలో ఈ అరెస్టులకు బీసీ కార్డు వాడి రాజకీయం చేసే ప్రయత్నం చేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. అయితే చంద్రబాబు ప్రయత్నాలు మొదట్లోనే నవ్వుల పాలయ్యాయి. ఇప్పుడు బీసీ సంఘాలు కూడా ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నాయి.