ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందనే సామెతలా అమరావతి పరిరక్షణ సమితి నేతల వ్యవహారం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్న మూడు రాజధానులైన… పరిపాలన, న్యాయ, శాసన రాజధానులు కేవలం అమరావతిలోనే కొనసాగించాలనే డిమాండ్‌తో అక్కడ భూములున్న కొందరు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ డిమాండ్ నెరవేరాలని కోరుతూ న్యాయ స్థానం నుంచి దేవస్థానం పేరుతో వారంతా తిరుమలకు మహాపాదయాత్ర పేరుతో నడక సాగిస్తున్నారు. వారి ప్రజాస్వామిక హక్కును ఎవరూ కాదనలేరు.
కానీ పాదయాత్ర నిర్వాహకులు నమ్ముకున్న పార్టీల పరపతి ఏంటో ఆలోచించకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. అమరావతిలో భూములు కలిగిన వారంతా చేపట్టిన మహాపాదయాత్ర నిర్వాహకులు ఈ నెల 17న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వ హించేందుకు సంకల్పించారు. ఇందులో భాగంగా తిరుపతిలో శుక్రవారం సీపీఐ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఆర్పీఐ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ పార్టీల్లో ప్రజాబలం ఉన్నదాని గురించి చెప్పుకోవాలంటే… టీడీపీ మినహా మరేది కనిపించదు. వామపక్ష పార్టీల సంగతి తెలిసిందే. మాటలు బారెడు, చేతలు చారెడు. రాయలసీమకు కనీసం హైకోర్టు ఇవ్వాలని సీపీఐ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఇక సీపీఎం విషయానికి వస్తే… హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో మాత్రం అన్ని రాజధానులు అమరావతిలో ఉండాలని పేర్కొంది. తన కార్యకర్తలు, నాయకులు, ప్రజల్ని తప్పు దోవ పట్టించేందుకు మాత్రం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉత్తుత్తి ప్రకటనలు చేయడం సీపీఎంకే చెల్లింది.
కాసేపటి క్రితం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కనీసం మర్యాదకైనా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని వామపక్ష పార్టీలు, టీడీపీ డిమాండ్ చేయకపోవడం, అమరావతి బానిసత్వానికి ప్రతీక కాక మరేంటి? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి మినహా, మిగిలిన ప్రాంతాల ఉనికినే గుర్తించడానికి నిరాకరిస్తున్న వారు రాయలసీమకు గుండెలాంటి తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకోవడం… సీమ వాసులను రెచ్చగొట్టడానికే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాయలసీమ, ఉత్తరాంధ్ర, అమరావతి మినహా కోస్తా ప్రాంతవాసులంతా తమ పల్లకీ మోయాలనే అహంకారపూరిత వైఖరిని ఆయా ప్రాంతాల ప్రజాసంఘాల నాయకులు, విద్యా, ఉద్యోగ వర్గాలు తప్పు పడుతున్నాయి.
మహాపాదయాత్ర రాయలసీమలో అడుగు పెడుతున్న నేపథ్యంలో… ఆ ప్రాంత అభివృద్ధిపై అమరావతి పరిరక్షణ సమితి, అలాగే వాటికి మద్దతు పలుకుతున్న రాజకీయ పక్షాల వైఖరి ఏంటో బహిరంగ పరచాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర, అమరావతి మినహా కోస్తా ప్రాంత సమాజం డిమాండ్ చేస్తోంది.
ప్రజాబలం లేని పార్టీలను నమ్ముకుని అమరావతిని సాధిస్తామని కలలు కనడం అంటే… కుక్కతోక పట్టి గోదారి ఈదినట్టే అని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు గుర్తెరగాలని సీమ సమాజం హితబోధ చేస్తోంది. అమరావతి పరిరక్షణ సమితి, అలాగే ఆ సంస్థ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తున్న వారు ఇతర ప్రాంతాల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి …చివరికి వేర్పాటువాద ఉద్యమానికి బీజం వేసేలా ఉంది.