తెలుగుదేశం వాళ్లు గగ్గోలు పెట్టడానికి ఎంచుకున్న తొలి అంశం 'చలో ఆత్మకూరు'. ప్రతిపక్షం అన్నాకా ఖాళీగా కూర్చుంటే జనాలు మరిచిపోతారు. ఇక జగన్ విధానాల మీద తీవ్రంగా ధ్వజమెత్తుతూ రోడ్డు ఎక్కడానికి అంత పెద్ద కాజ్‌లూ లేవిప్పుడు. ఇలాంటి నేఫథ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు ముందుగా తమ పార్టీ అంశాన్ని ఆధారంగా చేసుకున్నారు. తమ పార్టీ కార్యకర్తలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ వాళ్లు వేధిస్తున్నారంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు 'చలో ఆత్మకూర్'కు పిలుపునిచ్చారు. అయితే ఆయన ఆ కార్యక్రమాన్ని చేపట్టలేకపోయారు. ఆయనను ఇంటికే పరిమితం చేశారు పోలీసులు. అయినప్పటికీ చలో ఆత్మకూర్ విజయవంతం అంటూ తెలుగుదేశం ప్రకటించుకుంటూ ఉంది.
ఆ సంగతలా ఉంటే.. ఆ రోజున బాగా హడావుడి చేసిన వారిలో రాయలసీమకు ప్రాంతానికి చెందిన వారున్నారు. వారిలో ముందున్నారు భూమా అఖిలప్రియ. రాయలసీమ ప్రాంతానికి చెందిన పయ్యావుల కేశవ్ వంటి వాళ్లు కూడా ఆ రోజున గలాభారేపారు. అయితే పోలీసులతో వాగ్వాదానికి దిగి భూమా అఖిలప్రియ హడావుడి చేశారు. 'డోంట్ టచ్ మీ' అంటూ ఆమె పోలీసులపై తిరగబడ్డారు. వెనుకటికి ఇదే డైలాగ్ విసిరినందుకు గానూ భూమా నాగిరెడ్డి మీద చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కేసులు పెట్టించింది.
'డోంట్ టచ్ మీ' అనేమాటే అప్పుడు తప్పు అయిపోయింది. దాంతో భూమా నాగిరెడ్డిని జైల్లోపెట్టారు. ఆయన అస్వస్థతకు గురై అప్పుడే ఆసుపత్రి పాలయ్యారు. అక్కడ నుంచినే ఆయన ఆరోగ్యం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడినట్టుగా అప్పట్లో భూమా అఖిలప్రియ ప్రకటించారు. తన తండ్రికి ఏదైనా జరిగితే చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలన్నారు. అయితే ఆ తర్వాత భూమా నాగిరెడ్డి, అఖిలప్రియలు తెలుగుదేశం పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే.
భూమా నాగిరెడ్డి మరణం, అఖిలప్రియ మంత్రి అయిపోవడం జరిగింది. దీంతో చంద్రబాబు వీర విధేయురాలు అయ్యిందామె. ఇలాంటి నేపథ్యంలో అఖిలప్రియను ఆళ్లగడ్డ ప్రజలు తిరస్కరించారు. ఆమెను ఎమ్మెల్యేగా ఓడించారు. ఆమె సోదరుడిని నంద్యాల జనాలూ ఓడించారు. ఇప్పుడు ప్రతిపక్ష వాసంలో ఉన్న అఖిలప్రియ బీజేపీలోకి చేరబోతున్నారనే వార్తలూ వస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని అమె అంటున్నారు. దానికితోడు.. చలో ఆత్మకూర్ కార్యక్రమంలో ఆమె గట్టిగా మాట్లాడటంతో.. ఆమె తెలుగుదేశం పార్టీలోనే ఉండబోతోందనే సంకేతాలు ఇచ్చారనుకోవాలి.
అదంతా బాగానే ఉంది కానీ, ఎటొచ్చీ ఆమెకూ పల్నాడుకు ఏం సంబంధం? అనేదే అంతుబట్టని విసం అంటున్నారు పరిశీలకులు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆమె పల్నాడుకు వెళ్లి హడావుడి చేయడం ఏమిటని? అయినా.. రాజకీయ కక్షసాధింపు చర్యలకు సంబంధించి భూమా ఫ్యామిలీ మాట్లాడటమే పెద్ద కామెడీ అని కూడా అంటున్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో తన వ్యతిరేకులను అధికారం చేతిలో ఉన్నప్పుడు అఖిలప్రియ ఎలా ట్రీట్ చేసిందో ఎవరికి తెలియనిది? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతూ ఉన్నాయి.
ఆఖరికి సొంత పార్టీలో తనను వ్యతిరేకించే వారిని కూడా అఖిలప్రియ అణిచివేతకు గురించి చేసిందనే అభిప్రాయాలున్నాయి. ఆమె తీరు నచ్చక అనేకమంది తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు. అలా తన నియోజకవర్గంలో వ్యతిరేకతను పెంచుకున్నారు అఖిల. అలాంటామె ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లపై వేధింపులు అంటూ మాట్లాడటం, అది కూడా తనకు బీరకాయ పీచు సంబంధం లేని పల్నాడుకు వెళ్లి రోడ్ల మీద హైడ్రామాలు క్రియేట్ చేయడం.. ఇదంతా పెద్ద ప్రహసనం అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అసలు అక్కడ ఆమెకు ఏం పని? అనే ప్రశ్నలు కూడా ఆళ్లగడ్డ, నంద్యాల ప్రాంతం నుంచి వ్యక్తం అవుతున్నాయట. మరి వాటికి అఖిలప్రియ ఏమని సమాధానం చెబుతారో!