మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి రాజధాని పర్యటన అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఆమె రాజధాని రైతుల ఉద్యమ ఖర్చుల కోసం తన చేతిలోని రెండు బంగారు గాజులను వారికిచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజధాని అమరావతి కోసం రైతులు సాగిస్తున్న ఉద్యమం విజయవంతం అయ్యేందుకు జీవితాలనైనా ధారపోసేందుకు తమ కుటుంబం సిద్ధంగా ఉందన్నారు. భోజనం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్, అమరావతి అని చంద్రబాబు కలవరించేవారని చెప్పుకొచ్చారు.
భువనేశ్వరి పర్యటనపై రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులు, మేధావులు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. అలాగే రాజధానిలో భువనేశ్వరి పర్యటనతో కేవలం తమ సామాజిక వర్గం కోసమే టీడీపీ గందరగోళం చేస్తుందనే ఆరోపణలు బలపడ్డాయంటున్నారు. ఇప్పుడు రాజధానిని అక్కడే కొనసాగించాలని ఆందోళన చేస్తున్న వారిలో మెజార్టీ ప్రజలు బాబు సొంత సామాజికవర్గం వారే ఉన్నారంటున్నారు. అలాగే మిగిలిన సామాజికవర్గం వారు భూములు అమ్ముకున్నారని చెబుతున్నారు.
ఎప్పుడూ ఇంటి నుంచి బయటికొచ్చి ఆందోళనలు చేయని బాబు సామాజికవర్గ మహిళలు ఇప్పుడు రావడంతోనే వారికి మద్దతుగా సాటి సామాజికవర్గ మహిళగా భువనేశ్వరి వెళ్లారనే అభిప్రాయాన్ని కొందరు జర్నలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. భువనేశ్వరి పర్యటనతో సొంత సామాజికవర్గాన్ని కాపాడుకునేందుకే నారావారు సకుటుంబ సపరివారంగా ఆందోళనలో పాల్గొంటున్నారనే విమర్శలు లేకపోలేదు.
నిజంగా రైతులపై నారా కుటుంబానికి ప్రేమే ఉంటే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన రైతులకు మద్దతు ఇచ్చారా? అక్కడ కాల్పుల వరకు పరిస్థితి వెళ్లిందనే విషయం వారికి తెలుసా? నాడు వారికి మద్దతు తెలపాలని ఎందుకు అనిపించలేదని ప్రశ్నిస్తున్నారు. అలాగే గంగవరం పోర్టు విషయమై మత్స్యకారులు ఆందోళన చేస్తే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. వాన్‌పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూములు కోల్పోయిన రైతులను ఏనాడైనా పట్టించుకున్నారా? అనే ప్రశ్నలను నారావారి కుటుంబానికి సంధిస్తున్నారు.
రాజధాని రైతుల ఆందోళనకు చలించానంటున్న భువనేశ్వరిని తహశీల్దార్ వనజాక్షిపై దాడి కదిలించలేదా? విద్యార్థిని రిషితేశ్వరికి జరిగిన అన్యాయం ఆలోచింపజేయలేదా? ఇటీవల దేశాన్ని కుదిపేసిన దిశ ఘటనపై కనీసం పత్రికాముఖంగానైనా భువనేశ్వరి విచారం వ్యక్తం చేశారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు వేలాది, లక్షలాది ఎకరాల భూమిని కోల్పోయిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయమని, కనీసం వారికి నేటికీ నష్టపరిహారం అందలేదని గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి పోలవరం ప్రాజెక్టుకు మూడు పంటలు పండించుకునే రైతుల ఆందోళనకు మద్దతు పలకాలని ఎందుకు అనిపించలేదని ప్రశ్న వేస్తున్నారు.
అంటే వారంతా మనుషులు కాదా? ఆ బాధిత రైతులంతా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారు కాకపోవడమే నేరమా అని పలువురు మేధావులు, జర్నలిస్టులు, విద్యావంతులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజాసంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
నారా భువనేశ్వరి పర్యటన ఒక రకంగా రాజధాని బాబు సొంత సామాజికవర్గ జాగీరనే ప్రచారానికి బలం చేకూర్చిందని వారు అంటున్నారు. భువనేశ్వరి పర్యటన వల్ల టీడీపీతో పాటు రాజధాని రైతులకు కూడా నష్టం కలిగించిందనే వాదన ముందుకొస్తోంది.