ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో స్వతంత్ర భారతదేశం తరఫున తొలి గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్డాపై కానుకల వర్షం కురుస్తోంది. టోక్యో ఒలింపిక్స్ ముగుస్తున్న దశలో ఇక ఈ సారి స్వర్ణం సాధ్యం కాదేమో అనుకున్న దశలో.. సంచలనం సృష్టించిన ఈ 23 యేళ్ల యువకుడిపై ప్రభుత్వాలు, ప్రైవేట్ కంపెనీలు పోటాపోటీగా కానుకలు ప్రకటిస్తున్నాయి. భారతదేశానికి అపురూపమైన స్వర్ణాన్ని అందించినందుకు గానూ.. ఈ యువకుడికి భారీ మొత్తం ప్రైజ్ మనీలు అందిస్తున్నాయి ప్రభుత్వాలు.
నీరజ్ చోప్డా సొంత రాష్ట్రం హర్యానా ఈ యువకుడికి ఏకంగా ఆరు కోట్ల రూపాయల బహుమతిని ప్రకటించింది. ఒలింపిక్స్ లో స్వర్ణపతాకానికి ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఒక బహుమతిని రొటీన్ గా ఇస్తుంది. స్వర్ణానికి ఒక స్థాయి ప్రైజ్ మనీ, రజతానికి, కాంస్యానికి కూడా ఒక ప్రైజ్ మనీని ముందుగానే ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ సెట్ చేసి ఉంటుంది. ఆ ప్రైజ్ మనీ కాకుండా.. హర్యానా అందించే ఆరు కోట్ల రూపాయల బహుమానం నీరజ్ కు దక్కుతుంది.
ఇక పంజాబ్ రాష్ట్రం నీరజ్ కు మరో రెండు కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించింది. నీరజ్ పూర్వీకులది పంజాబేనట. ఇలా పక్క రాష్ట్రం నుంచి కూడా నీరజ్ కు రెండు కోట్ల రూపాయల భారీ బహుహానం అందుతోంది.
అలాగే హర్యానా రాష్ట్రం నీరజ్ కు మరిన్ని బహుమానాలు కూడా ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. దాంతో పాటు రాష్ట్రంలో ఎక్కడ ఇళ్లు కొనుక్కొన్నా అందులో సగం సబ్సీడీ అని ప్రకటించింది. ఇదేగాక పంచకుల లో తాము ఏర్పాటు చేస్తున్న స్పోర్ట్స్ అసోసియేషన్ బాధ్యతలు ఇవ్వడానికి కూడా సై అని ప్రకటించింది.
ఇక నీరజ్ కు బీసీసీఐ కోటి రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించింది. దేశంలోనే అత్యంత ధనిక స్థాయిలోని స్పోర్ట్స్ బోర్డు అయిన బీసీసీఐ ఒలింపిక్ప్ పతకధారులందరికీ ప్రైజ్ మనీ ప్రకటించింది. అందులో భాగంగా స్వర్ణపతాకధారి నీరజ్ కు కోటి రూపాయలు ప్రకటించింది. అలాగే ఇండియన్ హాకీ టీమ్ కు1.25 లక్షల రూపాయల డబ్బును బీసీసీఐ అనౌన్స్ చేసింది. ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన ఇతర ఆటగాళ్లకూ ప్రైజ్ మనీని అనౌన్స్ చేసింది.
నీరజ్ కు మణిపూర్ గవర్నమెంటు కోటి రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించింది. మణిపూర్ కేబినెట్ మీటింగ్ లో చర్చించి మరీ ఈ ప్రైజ్ మనీని ప్రకటించారు. ఇక ప్రైవేట్ కంపెనీల విషయానికి వస్తే.. ఐపీఎల్ ప్రాంచైజ్ చెన్నై సూపర్ కింగ్స్ నీరజ్ కు కోటి రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించింది. ఒలింపిక్స్ లో భారత్ తరఫున అద్భుతం సాధించినందుకు గర్విస్తూ ఈ ప్రైజ్ మనీని ప్రకటిస్తున్నట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ ప్రకటించింది.
క్రీడాకారులకు తమ కార్లను బహుమానంగా ఇవ్వడంలో ముందుండే ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. నీరజ్ కు మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ను బహుమానంగా ఇవ్వనున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఇక విమానయాన సంస్థ ఇండిగో స్పందిస్తూ.. నీరజ్ కు ఏడాది పాటు ఫ్రీ ఎయిర్ టికెట్ ను ప్రకటించింది. ఒక సంవత్సరం పాటు నీరజ్ ఎక్కడకు ప్రయాణించాలనుకున్నా.. తమ విమానాల్లో ఫ్రీ అని ఆ సంస్థ అనౌన్స్ చేసింది.
ఇప్పటి వరకూ నీరజ్ కు దక్కిన బహుమానాల్లో ఇవి కొన్ని. ఈ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టుకు ఇంకా అనేక రకాల రివార్డులు దక్కే అవకాశాలున్నాయి. ఈ యంగ్ అథ్లెట్ తో ఒప్పందాల కోసం ఎండోర్స్ మెంట్లు కూడా ఈపాటికే ఎదురుచూస్తూ ఉంటాయి.