బీజేపీ నేతలు మాట్లాడితే పెద్ద మాటలే వస్తాయి. వారు చూపు జాతీయం, భావాలూ జాతీయం. అందుకే ప్రాంతీయంగా ఏమున్నదీ, లేనిదీ కూడా అసలు చూసుకోవడంలేదు. ఇక పార్టీగా మాటకు వస్తే ఏపీలో నిండా మునిగారు, నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీగా మిగిలారు. ఇక ఏమైనా సూక్తిముక్తావళి వల్లిస్తారు.
విశాఖలోనే కూర్చుని అక్కడ రాజధాని వద్దు అనగలిగే ధైర్యం ఎవరికి ఉంటుంది. చంద్రబాబు లాంటి వారే విశాఖకు రాలేక పలుమార్లు టూర్లను వాయిదా వేసుకుంటున్నారు. కమలానికి మాత్రం ఆ కంగారు, బెంగా అసలూ అక్కరలేదు. ఎందుకంటే వారికి పోయేదేమీ లేదు కాబట్టి. అందుకే ధైర్యంగా విశాఖలోనే మీటింగులు పెడతారు. అమరావతే ముద్దు అంటారు.
ఇక బీజేపీ అగ్ర నేత అనబడే సునీల్ ధియోధర్ విశాఖ వచ్చి మూడు రాజధానులకు తాము వ్యతిరేకమని చెప్పివెళ్ళారు. ఆయనతో పాటు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, విశాఖ ఓట్లతో ఒసారి ఎంపీగా గెలిచిన దగ్గుబాటి పురంధేశ్వరి కూడా విశాఖ రాజధాని వద్దని, అమరావతే ముద్దు అనేశారు.
ఇలా కమలనాధులు చిలకపలుకులు పలకడమే కాదు, ఏపీలో మేమే చాంపియన్లమని, రేపటి ఎన్నికల్లో మా తడాఖా చూపిస్తామంటూ పెద్ద మాటలే మాట్లాడారు, వారు ఇలా వచ్చి అలా వెళ్ళగానే పోలోమంటూ మూడు వందల మంది కార్యకర్తలు బీజేపీ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీలో చేరిపోయారు.
మరి మా పార్టీ బలంగా ఉందని చెప్పుకోవడమే తప్ప ఉన్న వారిని కూడా కాపాడుకోలేనపుడు పెద్ద నాయకులు వచ్చి కూడా ఏం లాభమని పార్టీలో ఇంకా మిగిలిన వారు అంటున్నారు. అయినా విశాఖ రాజధాని వద్దు అంటే పార్టీలో లోకల్ గా ఉన్న వారు మిగులుతారా మరి. అయినా కమలానికి పోయేదేముంది కనుక.