ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతాపార్టీ కంటగింపుగా మారింది. తమ పార్టీ బలోపేతానికి, అధికారానికి బీజేపీ అడ్డంకిగా మారిందనే ఆగ్రహం టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. ప్రధాన ప్రత్యర్థి, అధికార వైసీపీని ఎదుర్కోవడం టీడీపీకి సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో మిగిలిన ప్రతిపక్షాలన్నింటిని కలుపు కుని పోవాలని ఇటీవల నిర్వహించిన మహానాడులో కూడా టీడీపీ తీర్మానించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీజేపీ తాజాగా కోర్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం టీడీపీకి మింగుడు పడడం లేదు. విజయవాడలో సోము వీర్రాజు నేతృత్వంలో నిర్వహించిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి పి.మురళీధరన్, జాతీయనేతలు శివప్రకాశ్, పురందేశ్వరి, సునీల్ దియోధర్, సత్యకుమార్, కన్నా లక్ష్మినారాయణ, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ఎమ్మెల్సీ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా ఏ అంశంలోనూ తెలుగుదేశం పార్టీతో బీజేపీ రాష్ట్ర శాఖ కలిసే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు ఎన్ని చేసినా ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, జనసేనాని పవన్‌కల్యాణ్ మద్దతు వల్ల టీడీపీ అధికారంలోకి రాగలిగింది. ఇదే 2019 సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ, బీజేపీ ఒంటరిగా, వామపక్షాలు, బీఎస్పీతో కలిసి జనసేనాని పవన్‌కల్యాణ్ తలపడ్డారు.
2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అందరికీ తెలిసినవే. టీడీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. జనసేనాని పవన్ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన దుస్థితి. ఈ నేపథ్యంలో 2024లో వైసీపీని ఓడించాలంటే ఒంటరిగా సాధ్యం కాదని టీడీపీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. అందువల్లే ఎలాగైనా బీజేపీని ఒప్పించి పొత్తు కుదుర్చుకుంటే, జనసేన కూడా కలిసి వస్తుందనే ఆశతో టీడీపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది.
కానీ సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీ అనుసరించిన మోదీ వ్యతిరేక వైఖరిపై బీజేపీ ఆగ్రహంగా ఉంది. టీడీపీ చేతిలో పదేపదే మోసపోవాలని అనుకోవడం లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అందుకే చంద్రబాబు ఓ పది మెట్లు దిగి స్నేహ హస్తం చాస్తున్నా…బీజేపీ నిర్మొహమాటంగా వద్దని తేల్చి చెబుతోంది.
ఇదే టీడీపీకి మింగుడు పడడం లేదు. బీజేపీ నిర్ణయం తీవ్ర నిరాశతో పాటు ఆగ్రహాన్ని కూడా కలిగిస్తోంది. మరి రానున్న రోజుల్లో వైసీపీని టీడీపీ ఒంటరిగా ఎదుర్కొని అధికారంలోకి రావా లనే ఆకాంక్షను ఎలా నెరవేర్చుకుంటుందో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.