ప్రపంచంలో 7 వింతల గురించి కథలుకథలుగా చెప్పుకుంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 8వ ప్రపంచ వింతను చూడాల్సి వస్తోంది. అది ఈ నెల 28న బెజవాడలో బీజేపీ నేతృత్వంలో నిర్వహించనున్న ‘ప్రజాగ్రహ సభ’ రూపంలో. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఏడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అన్యాయం గురించి ఎంత చెప్పినా తక్కువే అని రాష్ట్రంలోని చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. రాష్ట్రానికి మోడీ సర్కార్ చేసిన అన్యాయం గురించి గతంలో ప్రతిపక్షాలు పదేపదే చెప్పిన సంగతి తెలిసిందే.
తిరుమల శ్రీవారి పాదాల చెంత సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి, ఆ తర్వాత ఎసరు పెట్టారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని విభజన చట్టంలో పేర్కొని, ఆ తర్వాత ఊసే ఎత్తలేదు. జాతీయ ప్రాజెక్టు పోలవరానికి నిధులు తదితర అంశాల్లో రాష్ట్రానికి గత ఏడేళ్లుగా మోడీ సర్కార్ చేసిన, చేస్తున్న ద్రోహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. తాజాగా రాష్ట్రానికి సెంట్‌మెంట్ అయిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తూ వేలాది మంది భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టిన ఘన చరిత్ర కేంద్రంలోని బీజేపీ సర్కార్‌దే.
ఇలా ఒకటా రెండా…ఏపీకి కేంద్రంలోని బీజేపీ చేసిన అన్యాయాల గురించి చెప్పాలంటే! మోడీ సర్కార్ పాలనను చూస్తే ఏమున్నది గర్వకారణం…అంతా నరజాతి పీడనే అన్నట్టుగా తయారైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే… తగదునమ్మా అంటూ బెజవాడలో బీజేపీ నేతృత్వంలో ‘ప్రజాగ్రహ సభ’ నిర్వహించనుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందట. విజయవాడ నుంచి ఉద్యమ శంఖాన్ని పూరిస్తుందట. ఈ చేష్టలన్నీ చూస్తే…8వ వింత కాక మరేంటి? అనే ప్రశ్న ఉత్పన్నం కాకుండా ఉండదు. ముందుగా విశాఖ ఉక్కును పరిరక్షణ, పోలవరం పూర్తికి నిధులు మంజూరు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, తెలంగాణ-ఏపీ మధ్య నెలకున్న జల వివాద పరిష్కారం తదితరాలను తాను నెరవేర్చాల్సినవి చేసి, ఆ తర్వాత ఎలాంటి సభలు పెట్టుకున్నా అభ్యంతరం ఉండదు. కేసుల భయంతో ఏపీ రాజకీయ పార్టీలు ప్రశ్నించకపోవచ్చు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని గుర్తించి మసలుకుంటే బీజేపీకే మంచిది.