బీజేపీ వేరు, ఎన్డీఏ వేరు.. ఇదేం లాజిక్ పవన్!

బీజేపీ అమరావతి మాత్రమే ఏపీకి రాజధానిగా ఉండాలని చెబుతోంది. మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ రాజధాని విషయంలో మాకేమాత్రం సంబంధంలేదని కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేస్తోంది. ఈ రెండూ వేర్వేరుగా జరుగుతున్నవే. బీజేపీని, కేంద్ర…

బీజేపీ అమరావతి మాత్రమే ఏపీకి రాజధానిగా ఉండాలని చెబుతోంది. మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ రాజధాని విషయంలో మాకేమాత్రం సంబంధంలేదని కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేస్తోంది. ఈ రెండూ వేర్వేరుగా జరుగుతున్నవే. బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని విడివిడిగానే చూడాలి అని సెలవిచ్చారు జనసేనాని పవన్ కల్యాణ్. ఈనాడుకి ప్రత్యేక ఇంర్వ్యూలో మూడు రాజధానుల నిర్ణయం, అభివృద్ధి వికేంద్రీకరణపై పూర్తిస్థాయిలో విషం చిమ్మారు పవన్.

ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ లో మూడు రాజధానుల అంశంపై స్పష్టత లేదనుకున్నారు, బీజేపీతో జతకలిశారు కాబట్టి ఆ పార్టీ నిర్ణయం ప్రకారం మూడు రాజధానుల అంశంలో వేలు పెట్టరని అనుకున్నారు. కానీ ఆయనలో ఒరిజినల్ మనిషి మరోసారి బైటకొచ్చి కరాళ నృత్యం చేయడం మొదలు పెట్టారు. మూడు రాజధానుల నిర్ణయంపై విషం చిమ్ముతూ, పరోక్షంగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై తనకున్న అక్కసుని బైటపెట్టారు పవన్.

పేరుకు ప్రత్యేక ఇంటర్వ్యూ అంటూ చెప్పుకొచ్చినా.. ఇందులో కొత్తగా చెప్పేదేమీ లేకుండా పోయింది. పాత పచ్చపాత ధోరణినే కొత్తగా కళ్లకు కట్టారు. ఎన్నికల ముందు ప్రచారంలో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వమని స్పష్టంగా చెప్పిన జగన్, మూడు రాజధానులు చేస్తాము అని అప్పుడెందుకు చెప్పలేకపోయారని పవన్ నిలదీశారు.

ఒకవేళ అప్పుడే జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసి ఉంటే.. కనీసం ఆ 23 సీట్లు కూడా టీడీపీకి దక్కేవి కావు. ఇప్పుడు విశాఖ నాలుగు దిక్కుల్లో కొలువైన టీడీపీకి అప్పుడు కనీసం ఉత్తారంధ్రలో ఒక్క సీటు కూడా వచ్చేది కాదు. అమరావతిలో భూ కుంభకోణం జరిగిందనే కారణం ఓవైపు, మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే సంకల్పం మరోవైపు ఉన్నాయి కాబట్టే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై సిట్ తో విచారణ జరిపించారు, సీబీఐ ఎంక్వయిరీ కోరారు.

కోర్టులు ఈ రెండు విషయాలనూ అడ్డుకున్నాయి. అమరావతిపై విచారణ వద్దన్నాయి, ఇటు మూడు రాజధానులపై తుది నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని చెప్పాయి. ఈనేపథ్యంలో అభివృద్ధికి మద్దతు తెలపాలనే సంకల్పం ఉంటే పవన్ కచ్చితంగా మూడు రాజధానులకు జై అనేవారు. అవినీతిని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే.. అమరావతికి తద్వారా అక్కడ జరిగిన భూ కుంభకోణానికి మద్దతుగా మాట్లాడుతున్నారు.

జగన్ స్పష్టంగా చెప్పలేదు సరే.. పోనీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో అయినా పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పించగలరా? మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు.. అని మోడీతో అనిపించగలరా. ఆ దమ్ము పవన్ కల్యాణ్ లో ఉందా. అవసరానికి పొత్తులు పెట్టుకుంటూ,  అవకాశవాద రాజకీయాలు చేసే పవన్ కల్యాణ్ కూడా జగన్ ని విమర్శిస్తే ఇంకేం చెప్పాలి. 

పవన్ పరిస్థితి చూస్తుంటే.. చంద్రబాబుకు మద్దతుగా సీబీఐ ఎంక్వయిరీ వద్దంటూ తన ఫామ్ హౌజ్ లో మరో దీక్షకు దిగేలా ఉన్నారు.

నిశ్శబ్దం క‌ధ అనుష్క కోసం రాసింది కాదు

చిరంజీవి ఎప్పుడూ లేనంతగా ఏడ్చారు