మహారాజకీయం.. చేతులెత్తేసిన బీజేపీ?

మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ చేతులెత్తేసిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. మొన్నటి వరకూ 'నేనే సీఎం..' అంటూ ప్రకటించుకున్న ఫడ్నవీస్ ఇప్పుడు శివసేనను తిట్టడం మొదలుపెట్టారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నా…

మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ చేతులెత్తేసిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. మొన్నటి వరకూ 'నేనే సీఎం..' అంటూ ప్రకటించుకున్న ఫడ్నవీస్ ఇప్పుడు శివసేనను తిట్టడం మొదలుపెట్టారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నా సేన ముందుకు రావడం లేదంటూ ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. తమతో కలిసి పోటీ చేసిన శివసేన వెళ్లి కాంగ్రెస్-ఎన్సీపీలతో చర్చలు జరుపుతూ ఉందంటూ వ్యాఖ్యానించారు.

అయితే ఎన్నికలకు ముందే బీజేపీతో తాము ఒప్పందం చేసుకున్నామని, ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్టుగా శివసేన చెబుతోంది. తమ ఒప్పందానికి బీజేపీనే విలువను ఇవ్వడం లేదని సేన నేత రౌత్ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ఇలా ఇరు పార్టీల మధ్యనా పీఠముడి పడింది.

నేటితో అసెంబ్లీ పదవీకాలం ముగియడంతో ఫడ్నవీస్ రాజీనామా చేశారు. గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాలను ఇచ్చారు. శనివారంతో అక్కడ నూతన ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది.  అయితే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ-శివసేనలు ఇంత వరకూ సానుకూలంగా ముందుకు రావడం లేదు. ముఖ్యమంత్రి పీఠాన్ని ఎటుతిరిగీ సాధించాలని సేన పట్టుపడుతూ ఉంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉండి శివసేన బెదిరింపులకు మెట్టు దిగితే పరువు పోతుందన్నట్టుగా బీజేపీ వ్యవహారిస్తూ ఉంది. 

ఇక మెజారిటీకి ఆమడదూరంలో ఉన్న బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పరిచి నిలబెట్టుకునే ధైర్యం కనిపించడం లేదు. ఇండిపెండెంట్లను, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చీల్చి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వ్యూహం ఉండనే ఉంది. అయితే సేన, ఎన్సీపీ వంటి పార్టీలను ఈ దశలో చీల్చడం కమలానికి అంత తేలిక కూడా కాదు. అటు ఆ పార్టీలను చీల్చలేక, ఇటు సేనను బతిమాలలేక ప్రస్తుతానికి కామ్ గా ఉండటమే మంచిదని బీజేపీ భావిస్తున్నట్టుగా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.