జనసేనాని పవన్‌కల్యాణ్‌ను ప్రత్యర్థులు కూడా ఈ స్థాయిలో అవమానించలేదు. పవన్‌కల్యాణ్ పరువు మొత్తాన్ని ఆయన మిత్రపక్ష పార్టీకి చెందిన బీజేపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ తీసేశారు. దీంతో జనసైనికులు అరవింద్‌తో పాటు బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవన్‌కల్యాణ్ మద్దతును తాము తీసుకోలేదని, ఆయనే ప్రకటించారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ లెక్క లేకుండా మాట్లాడ్డం జనసైనికులకు పుండు మీద కారెం చల్లినట్టైంది.
జనసేనకు అనుకూలమనే పేరొందిన ఓ చానల్ గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అరవింద్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఇందులో భాగంగా గ్రేటర్‌లో బీజేపీ -జనసేన పొత్తు విషయమై యాంకర్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌పై అరవింద్ కామెంట్స్ బీజేపీకి బాగా నష్టం కలిగించేలా ఉన్నాయి.
బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడంపై అని యాంకర్ అంటుండగానే … బీజేపీ ఎంపీ అరవింద్ స్పందిస్తూ తామేమీ కలిసి పోటీ చేయడం లేదే అని ఎదురు ప్రశ్నించారు. మీకు పవన్ కల్యాణ్ మద్దతు ఇస్తున్నారు కదా? అని మరో ప్రశ్నను యాంకర్ సంధించారు.
పవన్‌కల్యాణ్ మద్దతు ప్రకటించారని, ఆయన తన అభ్యర్థులను పెట్టనని కూడా అన్నారన్నారు. అందుకు సంతోషం అని, దాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తున్నారా? అని మరో ప్రశ్న వేశారు.
ఇప్పటికైతే పవన్ కల్యాణ్ ప్రచారానికి రాలేదన్నారు. ఇప్పుడు కూడా ఆయన్ను అడిగిందేమీ లేదన్నారు. ఆంధ్రాలో పొత్తు ఉంది కాబట్టి గ్రేటర్‌లో భారతీయ జనతా పార్టీకి సాయం చేస్తామనుకున్నారన్నారు. ఇక్కడ జనసేన పెద్ద బలంగా కూడా లేదన్నారు.
రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి … అని సదరు జర్నలిస్టు ఏదో ప్రశ్నిస్తుండగా, అరవింద్ జోక్యం చేసుకున్నారు. “ఇక్కడ కూటమే లేదు. మాకు ఎవరితోనూ పొత్తులేదు. తెలంగాణలో బీజేపీ సొంతంగానే జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్ చేస్తుంది” అని అరవింద్ తెగేసి చెప్పారు.
కానీ మీ ప్రత్యర్థి పార్టీలు మాత్రం జనసేన మద్దతు బీజేపీ తీసుకుంటోందని అంటున్నాయని ప్రశ్నించగా, అరవింద్ తీవ్రస్థాయిలో స్పందించారు.
“మేము జనసేన మద్దతు తీసుకోలేదు. పవన్ కల్యాణే మద్దతు ప్రకటించారు. మేము సర్వే సత్యనారాయణ(కాంగ్రెస్)ను తీసుకోవడం లేదండి. ఆయనే వస్తున్నారు. బండ కార్తీకారెడ్డి (మాజీ మేయర్) గారిని తీసుకోలేదండి. ఆమే జాయిన్ అయ్యారు. భిక్షపతి యాదవ్‌ను తీసుకోలేదండి. వాళ్లు మోడీ గారి పాలన పట్ల ఆకర్షితులై జాయిన్ అయ్యారు” అని నిజామాబాద్ ఎంపీ అరవింద్ చెప్పుకొచ్చారు.
దీంతో జనసైనికులు భగ్గుమంటున్నారు. సోషల్ మీడియా వేదికగా అరవింద్ ఇంటర్వ్యూ చూపుతూ, ఒక్కో మాటపై ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఒక్క దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించగానే, అంత అహంకారం వద్దని హితవు చెబుతున్నారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్‌లు స్వయంగా తమ నాయకుడి దగ్గరికి వెళ్లి మద్దతు కోరిన విషయం తెలియదా అని అరవింద్‌ను జనసైనికులు నిలదీస్తున్నారు. మొత్తానికి అరవింద్ కామెంట్స్ జనసేనలో కాక రేపుతున్నాయి.