రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలను నలుగురిని చేర్చుకున్న భారతీయజనతా పార్టీ తన తదుపరి టార్గెట్ ఏపీ అసెంబ్లీ అని ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ నేతలు చాలామంది తమతో సంప్రదింపుల్లో ఉన్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వలసలకు రెడీగా ఉన్నారని, త్వరలోనే ఏపీ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ పక్షం ఏర్పడుతుందని ఈ కమలం పార్టీ ఎమ్మెల్సీ ప్రకటించారు.
ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను చూస్తారంటూ చెప్పుకొచ్చారు. అయితే రాజ్యసభలో విలీన ప్రక్రియను చేసినంత ఈజీగా ఏపీలో అసెంబ్లీలో ఎమ్మెల్యేల చేరికలు కుదరవేమో! తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయిస్తే ఆ అవకాశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వదలకపోవచ్చు. అలాంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి అసెంబ్లీ స్పీకర్ సంకోచించకపోవచ్చు.
ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలు గట్టిగా ఉండి.. ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం విభాగం బీజేపీలోకి విలీనం అనేంత స్థాయిలో ఉంటే ఆ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లవచ్చు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే మాత్రం వారిపై అనర్హత వేటు పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అప్పుడు ఉప ఎన్నికలు వస్తే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం కలిగే అవకాశం అవుతుంది.