లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో వరసగా రెండు సార్లు విజయాలు సాధించినా, అది కూడా గత కొన్ని దశాబ్దాల్లో ఏ పార్టీ సాధించనంత స్థాయి మెజారిటీ సాధించినా, రాజ్యసభలో మాత్రం భారతీయ జనతా పార్టీకి ఆధిక్యం అందని ద్రాక్షగా నిలుస్తూ వచ్చింది.
లోక్ సభ ఎన్నికల్లో సాధించిన విజయాల తరహాలో రాష్ట్రాల అసెంబ్లీల్లో బీజేపీకి విజయాలు దక్కలేదు. దీంతో రాజ్యసభ సభ్యుల ఎన్నికలో ఆ పార్టీ ఆధిక్యతను ప్రదర్శించలేకపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు కనిపిస్తూ ఉంది.
ఎన్డీయే కూటమి రాజ్యసభ ఎంపీల సంఖ్య వందను దాటింది. తాజాగా 11 మంది రాజ్యసభ సభ్యుల ఎన్నికలో బీజేపీ వాటాగా తొమ్మిది మంది ఎన్నిక కావడంతో ఆ పార్టీ బలం 92కు పెరిగింది. ఇలా రాజ్యసభలో ఆ పార్టీ మరింత బలోపేతం అయ్యింది.
ఎన్డీయే కూటమిలోని పార్టీలకు మరో 18 మంది రాజ్యసభ సభ్యుల బలం ఉంది. దీంతో స్థూలంగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి రాజ్యసభలో 110 మంది రాజ్యసభ సభ్యుల బలం దక్కినట్టుగా అయ్యింది.
కీలక బిల్లుల ఆమోదం సమయంలో బీజేపీ వాళ్లు రాజ్యసభలో ఇన్నాళ్లూ ముప్పుతిప్పలు పడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి వారికి ఊరట లభిస్తున్నట్టే. ఎన్డీయేకు అనుకూలంగా వ్యవహరించే అన్నాడీఎంకే తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులను కలిగి ఉంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ బలం రాజ్యసభలో మరింత పడిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి రాజ్యసభలో 38 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 13 మంది ఎంపీలున్నారు. బీజేడీ బలం తొమ్మిదిగా ఉంది.