బిహార్ గత టర్మ్ ఎలక్షన్స్ సమయంలోనే ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోడీ పాడిన ప్యాకేజ్ వేలం పాట ప్రహసనం పాలయ్యింది. బిహార్ అభివృద్ధి కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలంటూ.. ఎన్నికల ప్రచార సభలో మోడీ ఒక వేలం పాట పాడారు.
వేల కోట్ల రూపాయలతో మొదలుపెట్టి భారీ మొత్తానికి వెళ్లిపోయారు. బిహార్ లో అధికారాన్ని బీజేపీకి అప్పగిస్తే ఆ ప్యాకేజీ దక్కుతుందంటూ మోడీ ప్రకటించారు. మోడీ అలాంటి మాటలు చెప్పినా జనాలు అప్పట్లో కమలం పార్టీకి ఓటేయలేదు. వ్యతిరేక కూటమిని గెలిపించారు. ఆ తర్వాత తిమ్మిని బమ్మిని చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది.
అప్పుడే అనుకుంటే.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ ప్రస్తుత ఫీట్లు మరీ లేకిగా ఉన్నాయి. ఏకంగా కరోనా వ్యాక్సిన్ ను కూడా ఎన్నికల ప్రచారంలో వదల్లేదు బీజేపీ. తమకు అధికారం ఇస్తే.. కరోనా వ్యాక్సిన్ ను బిహార్ కు ఉచితంగా పంచుతారట! ఇదీ కమలనాథుల ఎన్నికల హామీ.
ఆలూ లేదూ చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్టుగా.. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇంకా కొసదేమొదలేదో తెలియడం లేదు. బ్రిటన్ వాళ్లు రూపొందించిన వ్యాక్సిన్ విషయంలో రోజుకో షాకింగ్ వార్తలు వస్తున్నాయి. ఇక ఇండియా వ్యాక్సిన్ కథేంటో చెప్పే వారు లేరు. మార్చి వరకూ వ్యాక్సిన్ ముచ్చట లేదని స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి తేల్చి చెప్పారు!
ఏరకంగా చూసినా.. ఇప్పుడప్పుడే వ్యాక్సిన్ సాధ్యం కాదు అని ప్రజలకూ స్పష్టం అవుతోంది. మొదట్లో డబ్ల్యూహెచ్ వో చెప్పినట్టుగా ఏడాదీ, ఏడాదిన్నర గట్టిగా పరిశోధిస్తే కానీ.. కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం దుర్లభం అనే మాటపై ఇప్పుడు ప్రజలకు స్ఫష్టత వస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం కరోనా వ్యాక్సిన్ ఉచితం, అది కూడా బిహార్ లో తమకు అధికారాన్ని ఇస్తే అంటూ బీజేపీ వాళ్లు బంపర్ ఆఫర్ ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉంది. బిహార్ జనాలు దీన్నెలా చూస్తారో కానీ.. ఈ ఎన్నికల హామీని కూడా భక్తులు సమర్థించగలరు కానీ, తటస్థులకు మాత్రం ఏవగింపును కలిగిస్తూ ఉంది.