సగం పదవులు, సగం టర్మ్ ముఖ్యమంత్రి పదవి కావాలంటున్న శివసేనకు భారతీయ జనతా పార్టీ తన ఆఫర్ ను ప్రకటించినట్టుగా తెలుస్తోంది. శివసేన డిమాండ్స్ కు భారతీయ జనతా పార్టీ ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. ఐదేళ్ల ముఖ్యమంత్రి పదవి తమకే అని బీజేపీ స్పష్టం చేస్తోందట. అయితే అంతగా అడుగుతున్నారు కాబట్టి శివసేనకు డిప్యూటీసీఎం పదవిని ఇస్తామని బీజేపీ ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
సగం మంత్రి పదవులు.. అంటే దాదాపు ఇరవై పదవులను శివసేన అడుగుతోంది. అయితే బీజేపీ మాత్రం పదమూడు పదవులు ఇస్తానంటోందట. అది కూడా కీలకమైన శాఖలు కేటాయించేది లేదని స్పష్టం చేస్తోందట. హోం మినిస్ట్రీతో సహా కీలకమైన నాలుగు శాఖలూ బీజేపీ వాళ్ల చేతిలోనే ఉంటాయట. పెద్దగా ప్రాధాన్యం లేని పదమూడు శాఖలను శివసేన వాటాకు ఇచ్చేందుకు బీజేపీ రెడీ అంటోందట.
ఈ ఆఫర్ కు శివసేన ముందుకు రావాల్సిందే అనేది బీజేపీ వెర్షన్. అయితే బీజేపీ ఇస్తున్న ఆఫర్లో శివసేన డిమాండ్స్ కు ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం. శివసేన మద్దతు లేకపోతే బీజేపీ ప్రభుత్వం నిలబడదు. అయితే కేంద్రంలో బీజేపీ సర్కారు ఉంది. అదే ఆ పార్టీ ధైర్యం.
రేపో, ఎల్లుండో దేవేంద్ర ఫడ్నవీస్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేస్తారట. బలనిరూపణ సమయంలో ఇండిపెండెండ్ల మద్దతు ఉంటుందని, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల నుంచి ఎమ్మెల్యేలను చీల్చుకుని ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ రెడీ అంటున్నట్టుగా ఉంది!