కోర్టులకెక్కడం, అడ్డుకోవడం టీడీపీ తన జన్మహక్కులా భావిస్తుంది. అలాంటిది టీడీపీ బాధ్యతను బీజేపీ నెత్తికెత్తుకోవడంపై సొంత పార్టీ శ్రేణుల్నే విస్మయపరుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంపై ఏదో ఒక రూపంలో టీడీపీ న్యాయస్థానాలను ఆశ్రయించి అడ్డు తగులుతోందన్న బలమైన ఆరోపణలున్నాయి.
మూడు రాజధానుల నిర్ణయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే అతి పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తుతానికి న్యాయస్థానంలో కేసు వేయడం ద్వారా అడ్డుకున్నారు.
ప్రస్తుతానికి వస్తే కోర్టులను ఆశ్రయించడం అలవాటుగా మార్చుకున్న టీడీపీ పంథాను బీజేపీ ఫాలో కావడం ఆశ్చర్యం కలిగి స్తోంది. తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ అభ్యర్థి రత్నప్రభ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ఇలాంటివి చేయడంలో ఆరితేరిన టీడీపీని కాదని బీజేపీ దూకుడు ప్రదర్శించడం ఆలోచింపదగిందే.
ప్రజాకోర్టులో చేతులెత్తేసిన బీజేపీ …తాజాగా హైకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా ఏం సాధించాలని అనుకుంటున్నదో ఎవరికీ అర్థం కావడం లేదు. ఉప ఎన్నికకు ముందు ….అది చేస్తాం, ఇది చేస్తాం, ప్రత్యర్థులను పొడిచేస్తామని బీరాలు పలికిన బీజేపీ నేతలు ….తీరా ఎన్నికల రోజు మాత్రం పత్తా లేకుండా పోయారు. ఒక్క తిరుపతిలో మినహా మరెక్కడా బీజేపీ నేతల జాడే లేకుండా పోయింది.
ఉప ఎన్నికలో కనీసం గౌరవప్రదమైన ఓట్లు కూడా తెచ్చుకుంటారో, లేదో తెలియని బీజేపీ నేతలు … ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించడం ద్వారా ఎన్నికలను రద్దు చేయించగలరా? అది సాధ్యమేనా? ఘోర ఓటమితో ప్రజల్లో పరువు పోగొట్టుకుంటామనే భయమే ఆ పార్టీని కోర్టు మెట్లు ఎక్కించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 17న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరగలేదని పిటిషన్‌లో రత్నప్రభ పేర్కొనడం గమనార్హం.
కనీసం ఎన్నికల్లో ఏజెంట్లను కూడా సరిగా పెట్టుకోలేని దయనీయ స్థితిలో ఉన్న బీజేపీ నేతల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, నిష్పాక్షికత …తదితర పెద్దపెద్ద మాటలు కొందరు మాట్లాడితే ఒళ్లుపై తేళ్లు, జెర్రులు పారాడు తున్న ఫీలింగ్.
కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందర్నీ బ్లాక్‌మెయిల్ చేసే సంస్కృతికి చరమగీతం పాడి, రాష్ట్రాలకు ఏదైనా మంచి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడితే తెలుగు సమాజం ఆదరిస్తుంది. అలా కాకుండా ప్రజాక్షేత్రంలో బలపడేందుకు ఇతరేతర మార్గాలను అనుసరించాలని ప్రయత్నిస్తే మాత్రం… ఇక్కడ ఆ పప్పులుడకవని తిరుపతి ఉప ఎన్నిక ద్వారా స్వీయానుభవం చెప్పకనే చెప్పింది.
ఉప ఎన్నిక రద్దుపై హైకోర్టును ఆశ్రయించే హక్కు కాదనలేం కానీ, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటే భారతీయ జనతా పార్టీ నేతలు కాదనగలరా?
సొదుం రమణ