అనగనగా ఒక ఆవు అంటూ కధ చెప్పడంతో ఏపీ బీజేపీ నాయకులు దిట్టలు అంటున్నారు ఉక్కు ఉద్యమ కారులు. తాము విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతూంటే ఏపీకి ఇన్ని నిధులు ఇచ్చాం, అది చేశాం ఇది చేశామంటూ పెద్ద లిస్టు పట్టుకుని వల్లించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని వారు గుర్రుమంటున్నారు.
విశాఖలో ఉక్కు ఆరు నెలలుగా ఉద్యమం సాగుతూంటే కంటికి కనిపించడంలేదా అని నిలదీస్తున్నారు. విశాఖలోనే బీజేపీ రాష్ట్ర స్థాయి కీలక సమావేశాన్ని తాజాగా నిర్వహించి అర్జంటుగా పెండింగ్ నీటి ప్రాజెక్టుల గురించి బీజేపీ నేతలు చర్చించడంపైన కార్మిక లోకం ఆగ్రహిస్తోంది.
ఇపుడు రగులుతున్న అంశమేంటి, మీరు చర్చిస్తున్న విషయమేంటి అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. విశాఖ మాస్టర్ ప్లాన్ లో అవతకతవకలు అంటారు, ఆందోళన చేస్తారు, గుళ్ళూ గోపురాలు తిరుగుతారు, హిందూత్వ అని నినదిస్తారు, మధ్యలో 17వ శతాబ్దం నాటి టిప్పు సుల్తాన్ ని కూడా తీసుకుని వస్తారు కానీ కళ్ల ముందే భారీ వేటుకు బలి అవుతున్న స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా అనలేకపోతున్నారు.
ఎందుకింతలా ముఖం చాటేస్తున్నారు అంటూ ఉక్కు కార్మికులు గద్దిస్తున్నారు. విశాఖ ఏపీకి గర్వకారణం అయిన ప్లాంట్. దాని ప్రైవేటీకరణ ఆపండి అని ఒక్క మాట కూడా ఢిల్లీ పెద్దలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు అని కూడా మండిపడుతున్నారు.
మొత్తానికి విశాఖ ఉక్కు సమస్య కాదు కానీ ఎక్కడ లేని ఇతర అంశాలు బీజేపీ పెద్దలకు సడెన్ గా గుర్తుకు వచ్చేస్తున్నాయని సెటైర్లు పడుతున్నాయి.