తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో వైసీపీని గెలిపించి, అభివృద్ది కార్యక్రమాలకు మద్దతు తెలపాలంటూ అధికార పార్టీ ప్రచారం చేసుకుంటోంది. వైసీపీని ఓడించి జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపిచ్చి టీడీపీ లేనిపోని గాంభీర్యం ప్రదర్శిస్తోంది.
రాగా పోగా.. బీజేపీ-జనసేన కూటమికి అస్సలు ఒక్క పాయింట్ కూడా తట్టడం లేదు. కొన్నిరోజులు దొంగ ఓట్లు జమ చేశారంటారు, ఇంకొన్ని రోజులు వాలంటీర్లతో చీటింగ్ చేస్తున్నారని రచ్చ చేస్తారు. తాజాగా.. రత్నప్రభను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బీజేపీ నాయకులు అలవికాని హామీలతో రచ్చ చేస్తున్నారు.
రత్నప్రభను గెలిపించి పార్లమెంట్ కి పంపిస్తే.. రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఆమెకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని, తిరుపతి పార్లమెంట్ అభివృద్ధికే కాదు, ఏపీకి మరిన్ని నిధులు సాధించడంలో ఆమె మంత్రి పదవి ఉపయోగపడుతుందని ప్రచారం చేస్తున్నారు.
ఆలూ లేదు.. చూలూ లేదు..
అభ్యర్థిని ప్రకటించడానికే కిందా మీదా పడ్డ బీజేపీ నేతలు, తీరా అభ్యర్థిని ప్రకటించి, ఏకంగా ఆమెను కేంద్ర మంత్రిని చేస్తామనడం నిజంగా హాస్యాస్పదం. కనీసం జనసేన మద్దతు కూడా ఉంటుందని గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితుల్లో ఏకంగా కేంద్ర మంత్రి అంటూ కామెడీ చేస్తున్నారు బీజేపీ నేతలు. కనీసం ఇదే మాట కేంద్రం నుంచి మరో బడా నేత వచ్చి చెబితే, కొంతైనా విశ్వసనీయత ఉంటుంది.
ఆ ప్రయత్నం చేయకుండా తిరుపతి జనాల్ని మరోసారి మోసం చేసేందుకు బీజేపీ నేతలు ఇలా బరితెగించారు. వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే, వారి కౌంట్ ఒకటి పెరుగుతుంది, టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తే.. అస్సలు ఏమాత్రం ఉపయోగం లేదు. అందుకే తమ అభ్యర్థిని గెలిపించండి అంటూ బీజేపీ నేతలు హడావిడి చేస్తున్నారు.
మంత్రి అయితే ఎవరికి లాభం..?
కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చింది.. ఏపీకి ఏమైనా ఉపయోగం ఉందా? గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో మంత్రి పదవులు అనుభవించారు బీజేపీ నేతలు, కేంద్రంలో టీడీపీకి మంత్రి పదవులిచ్చారు. ఏం లాభం..? ఏపీకి ఏమైనా ఉపయోగం ఉందా? మరిప్పుడు రత్నప్రభకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఎవరికి లాభం? వ్యక్తిగతంగా ఆమెకి ఉపయోగమా లేక తిరుపతికి ఉపయోగమా?
తిరుపతి ప్రజలు ఆమాత్రం ఆలోచించే స్పృహలో లేరనుకుంటున్నారా? అందుకే ఇలాంటి వ్యర్థ హామీలు ఇస్తున్నారా అంటూ నెటిజన్లు బీజేపీ నేతలపై సెటైర్లు పేలుస్తున్నారు. బీజేపీ రెండో స్థానానికో, మూడో స్థానానికో పోటీ పడితే చాలని హితవు చెబుతున్నారు.