సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి ముందే ఒక వర్గం మీడియా బాలీవుడ్ విషయంలో తన అజెండాను అమలు చేయడం ప్రారంభించింది. అప్పట్లో అది హైలెట్ కాలేదు, సుశాంత్ మరణం తర్వాత ఆ వ్యవహారాన్ని వేడెక్కించగలిగారు. విభజించూ, పాలించు అనే థియరీకి అనుగుణంగా బాలీవుడ్ ను కూడా స్పష్టంగా వేరు చేసే ప్రయత్నం ఒకటి కొన్ని నెలల కిందట ప్రారంభం అయ్యింది. కొంతమంది బాలీవుడ్ హీరోలకు పాకిస్తాన్ తో సంబంధాలు, ఐఎస్ఐతో లింకులూ అంటూ మొదలుపెట్టింది మీడియా.
బాలీవుడ్ నటులకు ఐఎస్ఐతో లింకులు అంటే.. అది చిన్న విషయం కాదు. అదే నిజం అయితే సాయంత్రానికి వారిని తీసుకెళ్లి జైల్లో పడేయాలి. అదేంటో మరి.. అంత సీరియస్ వ్యవహారం కూడా కొన్ని చాన్నళ్లలో ఒక సాయంత్రం తాపీగా మాట్లాడుకునే వ్యవహారం అవుతుంది. ఆ చర్చలో యాంకర్ రెచ్చిపోయి మాట్లాడతాడు, ఆ నటులూ ఐఎస్ఐతో సంబంధాలు నెరుపుతున్నారని గసపోసుకుంటూ మాట్లాడతాడు.
గంట చర్చకు ఏదో కంక్లూజన్ ఇచ్చి ముగిస్తారు! అది కూడా బాలీవుడ్ ప్రముఖ హీరోల పేర్లను ఆ చర్చలో ప్రస్తావిస్తారు. మరి వారి అరెస్టులు ఉండవు, కేసులు ఉండవు! జస్ట్ జనాల్లోకి ఒక విభజనను తీసుకెళ్లడానికి మీడియా ద్వారా ఈ పావులన్నీ కదుపుతారు అనేది స్పష్టం అవుతున్న విషయం.
ఈ క్రమంలో ఇప్పుడు బాలీవుడ్ జనాలు ఒకరి జుట్లు మరొకరు పట్టుకునే పరిస్థితి వచ్చింది. మొన్నటి వరకూ చాలా సన్నిహితులుగా మెలిగిన జయాబచ్చన్, జయప్రదలు ఇప్పుడు కొప్పులు పట్టుకునేలా ఉన్నారు.
సమాజ్ వాదీ పార్టీ తరఫున వీరిద్దరూ గతంలో చట్టాపట్టాలేసుకున్నారు. అయితే ఇప్పుడు జయాజీ మాటలు సబబు కాదంటూ జయప్రద అంటోంది. జయప్రద బీజేపీలో ఉన్నారు. ఇక బీజేపీ ఎంపీ అయిన రవికిషన్ కూడా బాలీవుడ్ డ్రగ్స్ లో జోగుతోందని అంటున్నారు. ఇక అందరూ చెడ్డవాళ్లే తను తప్ప అని చెప్పుకునే కంగనా రనౌత్, అనధికారికంగా బీజేపీ అధికార ప్రతినిధి అయిన పరిస్థితి నెలకొంది!
బీజేపీ ద్వారా రాజకీయ ప్రయోజనాలు ముడిపడిన నటులు వీలైతే బాలీవుడ్ తీరును తప్పు పడుతున్నారు, లేకపోతే వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. యావత్ బాలీవుడ్ మీదా బురదజల్లితే సహించేది లేదని మరి కొందరు నటీనటులు, దర్శకులు స్పందిస్తున్నారు.
ఇంకొందరు ఈ వ్యవహారంలో స్పందించి అధికార పక్షానికి టార్గెట్ అయ్యే బదులు కామ్ గా ఉండటం మంచిదనే లెక్కలతో గమ్మునున్నారు. మరోవైపు దేశంలో ఇన్ని సమస్యలు ఉండగా.. బాలీవుడ్ గురించి పార్లమెంట్ లో చర్చించాల్సిన అవసరం ఉందా? ఇదంతా జనాలను అసలు సమస్యల నుంచి డైవర్ట్ చేసేందుకు అనే వాదనా బలంగా వినిపిస్తూ ఉంది!
ఏతావాతా.. ఈ చెత్త వల్ల సామాన్యుడికి అయితే పైసా ప్రయోజనం లేదు. కరోనాతో కోట్ల మంది ఉపాధి కోల్పోయారు, ఇన్నాళ్లూ ఏదో పని చేసుకుంటూ బతికిన నిరక్షరాస్య యువత ఇప్పుడు ఆ పనులు లేకపోవడంతో పెడ మార్గాలు పడుతున్న పరిస్థితులూ క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. వీటి గురించి మాట్లాడే వాళ్లు మాత్రం కనిపించడం లేదు. ఎంత సేపూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్, రియా చక్రబర్తి, బాలీవుడ్ ఎవురు డ్రగ్స్ వాడుతున్నారు.. ఇవే దేశానికి ప్రాధాన్యతాంశాలు అవుతున్నాయి. ఇంతకు మించిన విషాదం లేదు.