మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా కూడా తన పెత్తనమే చలామణీ అయ్యేలా చూసుకున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అయితే ఇపుడు ఆయనను వైసీపీ అధినాయకత్వం కాస్తా పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఆయన ఓ వర్గాన్ని ఏర్పాటుచేసుకుని జిల్లా రాజకీయాలలో సామంతరాజుగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అధినాయకత్వం నేరుగా రంగంలోకి దిగిపోయింది. అందరు నాయకులతోనూ సంప్రదింపులు జరుపుతూ అందరికీ సమాన అవకాశాలు ఇస్తోంది.
ఈ నేపధ్యంలో బొత్స వ్యతిరేక వర్గంగా ఉన్న ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర, అలజంగి జోగారావులతో పాటు ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కూడా ఈ మధ్య జోరు చేస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణ జరిగితే కచ్చితంగా కోలగట్లకు పదవి రావడం ఈసారి ఖాయమన్న వార్తల నేపధ్యంలో బొత్స ఇలాకాలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయా అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి.
మరో వైపు వచ్చే ఎన్నికలలో తనతో పాటు, తన సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, కుమారుడు సందీప్లకు కూడా టిక్కెట్లు కావాలని అపుడే బొత్స పావులు కదుపుతున్నారు. గత ఎన్నికలలో బొత్స కుటుంబానికే ఏకంగా అరడజన్ టిక్కెట్లు ఇచ్చిన వైసీపీ అధినాయకత్వం ఈసారి మాత్రం అలాంటి పొరపాట్లు చేయదని అంటున్నారు.
దాంతో, తన కుటుంబ రాజకీయాలను పార్టీపై బలంగా రుద్దాలనుకుంటున్న బొత్సకు ఇది ఇబ్బందికరమైన పరిణామమే అంటున్నారు. వచ్చే ఎన్నికలలో చాలా మార్పులు ఉంటాయని వైసీపీ అధినాయకత్వం ఆలోచనలను బట్టి తెలుస్తోంది. అదే కనుక జరిగితే మాత్రం బొత్సకు భారీ షాక్ ఖాయమనే చెప్పాలి.