రాజకీయ నాయకులు తక్కువోళ్ళు కాదు. వేలు పెట్టే సందు ఇస్తే చాలు కాలు పెడతారు. ఏకులా వస్తారు మేకులా మారతారు. గుడినే కాదు గుళ్లోని లింగాన్ని కూడా మింగేస్తారు. ఇలా పొలిటీషియన్స్ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. కుటుంబాలకు కుటుంబాలే రాజకీయాల మీద బతికేసే పరిస్థితులు ఉన్నాయి.
ఉద్యోగాల్లో, వృత్తుల్లో స్థిరపడిన తమ వారసులను కూడా తమ జీవిత కాలంలోనే గొప్ప నాయకులుగా తయారుచేయాలని కొందరు కలలు కంటారు. అందుకోసం ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే రాజకీయాల్లో కిక్కు వారికి తెలుసు కదా.
ఇలా ప్రయత్నాలు చేస్తున్న నాయకుల్లో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేరాడు. తన వారసుడిని రాజకీయాల్లోకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన ప్రయత్నాలు మామూలుగా లేవట.
కొడుకును ముఖ్యమంత్రి జగన్ కంట్లో పడేసి వచ్చే ఎన్నికల్లో సీటు ఇప్పించాలని ప్లాన్ చేశాడు బొత్స . కొడుకు సందీప్ బాబు డాక్టరు. ప్రాక్టీసు చేస్తున్నాడు. ఇది ప్రజాసేవ అని బొత్స అనుకోవడంలేదు. అసలైన ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నాడు.
క్షేత్ర స్థాయిలో ఉన్న తన కేడర్ కు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇవ్వడమే కాకుండా సందీప్ బాబు నిత్యం ప్రజల మైండ్ లో ఉండేలా కార్యచరణ రూపోందించాలని తమ కార్యకర్తలకు ఆదేశించినట్లు బొత్స సన్నిహితులు చెబుతున్నారు.
ఒక వైపు నియోజకవర్గ స్థాయిలో కొడుకు కోసం గ్రౌండ్ ప్రీపేర్ చేస్తూనే మరో వైపు జగన్ కు సందీప్ బాబును దగ్గర చేయడానికి చూస్తున్నాడట బొత్స. అందులో భాగంగానే మొన్న జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరం వద్దకు తన కొడుకును తీసుకువెళ్లి రక్త ధానం చేయించాడు. అదే సమయంలో జగన్ కు కూడా పరిచయం చేశాడట.
తండ్రి రాజకీయాల్లో ఎప్పటినుంచో ఉన్నా ఏ రోజూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు సందీప్. కాని తాజాగా మొన్న ఆయన పుట్టిన రోజు సందర్భంగా విజయనగరం వ్యాప్తంగా గతంలో ఎన్నడు లేని విధంగా ప్లెక్సీలు కనిపించడంతో అందరి దృష్టి ఒక్కసారిగా ఆయన వైపుకి మళ్లింది.
అయితే వచ్చే ఎన్నికల్లో కొడుకును ఎక్కడ నుంచి పోటీ చేయించేదానిపై క్లారీటి లేకపోయినప్పటికి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఒక పూర్తి స్తాయి నేతగా తనని తయారు చేయడానికి బొత్స కంకణం కట్టుకున్నట్లు రాజకీయవర్గాల సమాచారం. తనను రాజకీయాల్లోకి తెచ్చిన గురువుకే నామాలు పెట్టిన గుండెలు తీసిన బంటు బొత్స.
ఉమ్మడి రాష్ట్రం నుంచి కీలక నేతగా ఉన్న ఈయన రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఒక దశలో ముఖ్య మంత్రి స్థానానికి కూడా పోటీ పడ్డాడు. ఉత్తరాంధ్రలో ఈయన చాలా కీలకం. ఈ క్రమంలో తన కుటుంబం నుంచి భార్యతోపాటు, తమ్ముడు, మరో కుటుంబ సభ్యుడి ని కూడా ఎమ్మెల్యేను చేశాడు.
కాంగ్రెస్ హయాంలో భార్య ఎంపీగా చేయగా అదే సమయంలో తమ్ముడు అప్పలనర్సయ్యను కూడా ఎమ్మెల్యే ను చేశారు.ఇక్కడితో ఆగకుండా మరో కుటుంబం సభ్యుడు బత్తికొండ అప్పలనాయుడుని కూడా నెల్లిమర్ల నుంచి ఎమ్మెల్యేను చేశాడు. ఇప్పుడు ఆయన దృష్టి తన సొంత వారసుడిపై పడింది.