తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నిక జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. వీటిల్లో తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితి హోరాహోరీగా కనిపిస్తూ ఉండగా, బద్వేల్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం నల్లేరు మీద నడకలా మారింది.
మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సమయానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 23 వేల ఓట్ల మెజారిటీతో నిలుస్తూ ఉంది. మొత్తం కౌంటింగ్ పన్నెండు రౌండ్ల పాటు సాగనుంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ లక్షకు సమీపిస్తుందా? అనే అంచనాలు ఏర్పడుతున్నాయి. నాలుగు రౌండ్ల కౌంటింగ్ ముగిసే సమయానికి మెజారిటీ ముప్పై వేలను దాటింది. బీజేపీకి లభించిన ఓట్ల సంఖ్య నాలుగు వేల లోపే ఉంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 40 వేలకు పైగా మెజారిటీని సాధించింది. ఈ నేపథ్యంలో ఈ బై పోల్ లో మెజారిటీ లక్షకు చేరితే అది భారీ విజయమే అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఈ ఉప ఎన్నిక పోరు నుంచి తప్పుకున్నా.. బీజేపీ నేతలు బద్వేల్ లోనే పాగా వేసి పని చేశారు.
తెలుగుదేశం పార్టీ క్యాడర్ ను, ఓటును తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే మూడు రౌండ్ల కౌంటింగ్ ముగిసే సమయానికి కూడా బీజేపీ మూడు వేల ఓట్లను కూడా పొందలేకపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతకన్నాదయనీయంగా ఉంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అయిన కమలమ్మ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఇమేజ్ తో కూడా ఆమె డిపాజిట్ ను దక్కించుకోవడం కష్టంగా మారినట్టుగా ఉంది.
ఇక హుజూరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ ల మధ్యన హోరాహోరీ పోరు నడుస్తూ ఉంది. రౌండ్ రౌండ్ కూ ఆధిక్యం మారే పరిస్థితి నెలకొంది.