కరోనా – కఠోరా వాస్తవాలు

ట్రేస్…ట్రాక్..ట్రీట్ అన్నది కరోనా ఫస్ట్ ఫేస్ లో విపరీతంగా వినిపించిన మాట. ఒక్క కేసు వస్తే చాలు, ఆ కేసు గత వారం రోజులుగా ఎవరెవరితో కాంట్రాక్టు అయ్యారు అన్నది ట్రాక్ చేసి, వారందరినీ…

ట్రేస్…ట్రాక్..ట్రీట్ అన్నది కరోనా ఫస్ట్ ఫేస్ లో విపరీతంగా వినిపించిన మాట. ఒక్క కేసు వస్తే చాలు, ఆ కేసు గత వారం రోజులుగా ఎవరెవరితో కాంట్రాక్టు అయ్యారు అన్నది ట్రాక్ చేసి, వారందరినీ క్వారంటైన్ సెంటర్లకు తరలించి అబ్జర్వేషన్ లో వుంచేవారు. ఇప్పుడు అలా ట్రాక్, ట్రేస్ చేయకపోవడంతో కరోనా పేషెంట్లు యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. మరి కేసులు పెరగకుండా ఎలా వుంటాయి?

కరోనా గాల్లో వ్యాపించదని, రోగి ముట్టుకున్న చోట ముట్టుకుని, నోరు ముక్కు,కళ్లు ముట్టుకుంటే వస్తుందని ప్రచారం చేసారు. శానిటైజ్ చేసుకోమన్నారు.

కానీ ఇప్పుడు కరోనా కొత్త వెర్షన్ గాల్లో మూడు గంటల సేపు వుంటుందని అంటున్నారు. మరి అలాంటపుడు ఈ శానిటైజర్లు ఏ మేరకు వర్క్ చేస్తాయి? కేవలం మూడు గంటలు గాల్లో వుంటుందా? గాల్లో ట్రావెల్ చేస్తుందా? అన్నది తెలియడం లేదు. అలా ట్రావెల్ చేస్తే ఏ ఒక్కరైనా తప్పించుకోవడం సాధ్యమా? 

కరోనా వ్యాప్తి కి సమూహాలు కీలకం అని, సోషల్ డిస్టెన్స్ ముఖ్యమని చెబుతూ వచ్చారు అప్పుడు. మార్కెలు మూసారు. మార్కెట్లు వికేంద్రీకరణ చేసారు. జనాలు మూగకుండా చూసారు. 

కానీ ఇప్పుడు మార్కెట్ లు, చేపల మార్కెట్ లు అలాగే వున్నాయి. థియేటర్లు అలాగే వున్నాయి. బార్లు, పబ్ లు అలాగే వున్నాయి. మరి కరోనా కట్టడి ఎలా?

మాస్క్ ల విషయంలో కూడా చిత్రంగా వుంది వ్యవహారం. ఎన్ 95 మాస్క్ లు తప్ప మరొకటి పని చేయవని నిపుణులు చెబుతున్నారు. కానీ రోడ్ల పక్కన ఎక్కడపడితే అక్కడ ఎలాంటి మాస్క్ లు పడితే అలాంటి మాస్కలు విక్రయిస్తుంటే ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. జనాలు మాస్క్ పెట్టుకోవాలన్నది నిబంధన కాబట్టి, ఏదో ఒకటి మొహానికి తగిలించుకుంటున్నారు. దీని వల్ల ఫలితం ఏముంటుంది?

అసలు ప్రభుత్వాలు మెడికల్ ఎమర్జన్సీ ప్రకటించి ప్రయివేటు ఆసుపత్రుల బెడ్ లు అన్నీ తన కంట్రోల్ లోకి ఎందుకు తీసుకోదు. అలా తీసుకుని పేషెంట్ల తీవ్రత బట్టి కేటాయించే పని చేయదు. డబ్బున్నవాళ్లు, అవకాశం వున్నవాళ్లు, భయంతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అవసరం అయిన వారు బెడ్ లు దొరక్క ప్రాణాలు కొల్పోతున్నారు. ఈ విషయమై ప్రభుత్వాలు ఎందుకు దృష్టి సారించడం లేదు?

కొందరు పేషెంట్లు ఏ సమస్య లేకున్నా జస్ట్ కరోనా సోకిన ఒకటి రెండు రోజుల్లో పోతున్నారు. కొందరు పేషెంట్లు కరోనా సోకినా, ఏ లక్షణాలు లేకుండా, ట్రీట్ మెంట్ తో బాగయిపోతున్నారు. దీనికి కారణాలు ఎవరికి వారు వారికి తోచినట్లు విశ్లేషించుకుంటున్నారు. మరణాల రేటు తక్కువ వుందని ప్రభుత్వాలు నమ్మబలకడానికి చూస్తున్నాయి. కానీ శ్మశానాల దగ్గర శవాల బళ్లు బారులు తీరుతున్నాయి.

కరోనా సెకెండ్ వేరియెంట్ అని, థర్డ్ మ్యూట్ అని ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అసలు సెకండ్ ఫేజ్ వేరు, సెకండ్ వేరియెంట్ వేరు. సెకెండ్ ఫేజ్ అంటే తగ్గుతుంది అని సరిపెట్టుకోవచ్చు. కానీ సెకెండ్ వేరియెంట్, థర్ట్ వన్ అంటూ కొత్త కొత్తవి పుట్టుకు వస్తుంటే ఇక ఇది అవిశ్రాంతగా సాగే సీరియల్  మాదిరిగా మానవాళిని వెన్నాడుతూనే వుంటుందనే భయం కలుగుతోంది.

ప్రభుత్వాలు కోర్టుల బాధ పడలేక నైట్ కర్ఫ్యూ అంటున్నాయి. తక్కువ మంది తిరిగే రాత్రి వేళ కర్ఫ్యూ అవసరమా? లేక ఎక్కువ మంది తిరిగే పగటి వేళ కర్ఫ్యూ అవసరమా? అన్న అనుమానానికి సమాధానం ఎవరు చెప్తారు? రాత్రి వేళ కర్ఫ్యూతో సాధించేది ఏమిటో ఎవరైనా వివరించగలరా? రాత్రి పది గంటలకు దుకాణాలు కట్టేసాక, ఫస్ట్ షోలు వదిలేసాక, బార్లు మూత పడ్డాక రోడ్ల మీద తిరిగే జనాలు ఎంత మంది? ఈ కర్ఫ్యూ వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?

కరోనా వ్యాక్సీనేషన్ కేంద్రాలను చూస్తుంటే, అసలు కరోనా వ్యాప్తికి ఇవే కీలకం అనిపిస్తున్నాయి. వందలాది మంది ఒకే చోట అలా మూగితే జరిగేది ఏమిటి? అక్కడ కనీసపు జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదు?

ప్రభుత్వాలు తమ ఆదాయం ఎక్కడ పోతుందో అని భయపడి లాక్ డౌన్ లు, పగటి పూట కర్ఫ్యూలు గాలికి వదిలేసాయి. ఇది ఇప్పుడు ఆసుపత్రులకు ఇబ్బడి ముబ్బఢిగా ఆదాయం పెంచుతున్నాయి. మొత్తం మీద మొదటి విడత కరోనాను కట్టడి చేయడానికి జనాలను కట్టడి చేసారు. కానీ మలివిడత కరోనా టైమ్ లో జనాలను కట్టడి చేయడం మానేసారు. అందువల్లే కరోనా కూడా కట్టడి కావడం లేదు. కానీ ప్రభుత్వాలు మాత్రం కేవలం వ్యాక్సినేషన్ అమలు చేస్తే చాలు ఇంకేమీ అక్కరలేదు అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.

రోజుకు మూడులక్షల కేసుల వస్తున్నాయి. రోజుకు రెండు లక్షల మందికి నయం అయిపోయినా, లక్ష మంది వెనక్కు వుంటున్నారు. ఇలా చూస్తుంటే కొన్నాళ్లకు కొన్ని లక్షల మంది రోగులు ఈ దేశంలో కరోనాతో బాధపడుతున్నవారు వుండిపోతారు. వీరందరూ నయమై, దేశం కరోనా ఫ్రీ కావాలంటే ఎన్ని నెలలు పడుతుంది? మరి ఈ లెక్కలు ప్రభుత్వం వేస్తున్నాయా? 

మొత్తం మీద కరోనా మలి దశ లేదా సెకెండ్ వేరియెంట్ నేపథ్యంలో తలెత్తుతున్న అనుమానాలు, భయాలుగా మారుతున్నాయి. భయాలుగా మారితే ఫరవాలేదు. కానీ పరిస్థితి భయానకంగా మారిపోకూడదు.